కన్నడనాట పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత నెల 29వ తేదీన మృతి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ చనిపోయి రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం పునీత్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ సమాధి సందర్శనకు రోజూ వేలాదిమంది అభిమానులు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఆయన ప్రస్తావన తీసుకు వస్తున్నారు.
తాజాగా ఒక అభిమాని ట్విట్టర్లో కన్నడలో అగ్ర దర్శకుడు అయిన సంతోష్ ఆనందారంకు ఒక ట్వీట్ చేశాడు. అందులో అభిమాని పునీత్ బయోపిక్ తీయాలని సంతోష్ ఆనందారంకు విజ్ఞప్తి చేశాడు. ‘ప్లీజ్ అప్పు సార్ బయోపిక్ తీయండి. మీరు అప్పు సార్ ను చాలా దగ్గర్నుంచి చూశారు. ఆయన ప్రేమించే విధానం, నైతిక విలువల గురించి మీకు బాగా తెలుసు. దయచేసి పునీత్ పై బయోపిక్ తీయండి.’ అని ట్వీట్ చేశాడు. అభిమాని ట్వీట్ కి డైరెక్టర్ సంతోష్ ఆనందారం స్పందించాడు.
‘ అప్పు సార్ ఎప్పుడూ మన గుండెల్లో నిలిచే ఉంటారు. ఆయన బయోపిక్ మూవీ తీసేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తా’ అని రిప్లై ఇచ్చారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ బయోపిక్ సినిమా రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా పునీత్ -ఆనందారం కాంబినేషన్ లో 2017 లో రాజకుమార, 2021లో యువరత్న సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.