ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించడం ఎవ్వరూ సహించలేకపోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి.
ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా సమస్యలపై జరగాలే కానీ… వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనస్సును కలచివేసింది.
ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో.. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో… అదొక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఈ మాటలు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా.
రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం… దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి` అంటూ ఎన్టీఆర్ పరోక్షంగా వైసీపీ నేతలకు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
— Jr NTR (@tarak9999) November 20, 2021