ఓడిపోయినా.. మోడీని హీరో చేస్తున్నారే..!

కేంద్ర ప్రభుత్వం మూడువ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేసి తీరాల్సిందేనని రైతులు యుద్ధం ప్రకటించారు. మీకు తెలియడం లేదు.. మేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చాలా మంచి చట్టాలు తెచ్చాం.. వాటివల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకునేంత తెలివితేటలు మీకు లేవు.. మేం చెప్పినమాట విని చట్టాలను ఫాలోకండి.. అని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. రైతులు తమ యుద్ధాన్ని అంతకంటె తీవ్రం చేశారు. మా బాగు ఏమిటో మాకు తెలుసు.. మరీ మీరు మమ్మల్ని అంత పప్పుసుద్దలుగా లెక్కకట్టి.. మా బాగు చూడక్కర్లేదు.. అన్నట్టుగా భీష్మించుకున్నారు. ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధమేఘాలు తీవ్రం అయ్యాయి.. ప్రభుత్వ దళాలు లాఠీలకు కూడా పని చెప్పాయి. అయినా రైతులు మాత్రం సత్యాగ్రహం, సంయమనం తమ అస్త్రాలుగా ఆ యుద్ధాన్ని కొనసాగించారు. మొత్తానికి యుద్ధం పూర్తయింది. ప్రధాని నరేంద్రమోడీ.. ఓడిపోయారు.!

సుమారు ఏడాది కాలం పాటు సాగిన పోరాటం తర్వాత.. మోడీకి దక్కిన ఓటమి ఇది. వ్యవసాయ చట్టాల విషయంలో తన ఓటమిని నరేంద్రమోడీ సంపూర్ణంగా అంగీకరించారు. ఆ చట్టాలు తెచ్చినందుకు ఆయన రైతులను క్షమాపణ కూడా కోరారు. ఇది నిస్సందేహంగా రైతుల విజయం. నరేంద్రమోడీ పరాజయం.

అయితే ఇక్కడ రైతులకు దక్కుతున్న అభినందనలకంటె మోడీకి దక్కుతున్న అభినందనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమల దళాలు తమ అధినేతను ఆకాశానికెత్తేయడంలో పోటీ పడుతున్నారు. దానికి తగ్గట్టే మీడియా కూడా.. మోడీ వెనక్కు తగ్గడాన్ని ఒక అద్భుతమైన చర్యగా వర్ణిస్తోంది. అది అద్భుతం అనేది నిజమే కావొచ్చు. కానీ అందుకు ఆయనను మహానుభావుడు అంటే ఎలా?

ఇవాళ వెనక్కు తగ్గడం ద్వారా ఇంత కీర్తిని నరేంద్రమోడీకి ఆపాదిస్తున్న వారు.. అసలు ఇలాంటి రైతు వ్యతిరేక చట్టాలను ఆయన ఎందుకు తీసుకు వచ్చారు. ఎవరి ముఖప్రీతికోసం తీసుకువచ్చారు అనే అంశాలను ఆలోచించలేకపోతున్నారు. ఈ చట్టాల మూలాల్లో ఎవరున్నారు? ఏ కుట్రలు దాగున్నాయి? అనేవైపు జనం దృష్టి మరలకుండా.. మోడీ కీర్తనలు భజనలు ప్రజల ఆలోచనల్ని హైజాక్ చేస్తున్నాయి.

మీడియాలో, ప్రధానంగా సోషల్ మీడియాలో తనకు సానుకూల ప్రచారాన్ని ఫ్యాబ్రికేట్ చేయడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. రైతుల మీద పోలీసుల అకృత్యాలు, భాజపా నాయకుల అకృత్యాలు, దాడులు ఇవేవీ ఇప్పుడు చర్చకు రావడం లేదు. చట్టాల రద్దు నిర్ణయం- ఇన్నాళ్ల కాషాయ ప్రభుత్వపు కర్కశత్వాన్ని మాయ చేసేస్తోంది. యూపీ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమే అయినా.. ఆ వాస్తవాన్ని ప్రజలు గుర్తించకుండా ప్రచారం మిన్నంటుతోంది.