మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!

October 11, 2021 at 8:13 am

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 665 ఓట్లు పోలవగా.. విష్ణుకు 380 ఓట్లు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మా ఎన్నికల హడావిడి మొదలైన కొత్తలో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఇక విజయం అయనదే అని అంతా అనుకున్నారు.

అయితే ఆ తర్వాత అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఒకవేళ ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని అనుకున్నారు. అయితే ఎన్నికల సమయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. మంచు విష్ణు ప్రతి విషయంలోనూ ప్రకాష్ రాజ్ కంటే దూకుడుగా వ్యవహరించాడు.

సినిమా వాళ్లకు ‘మా’ భవనం నిర్మిం చడం అనేది ఒక కల. అంతకుముందు పాలించిన వారందరూ ఎన్నో హామీలిచ్చినప్పటికీ మా భవనం మాత్రం కట్ట లేక పోయారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తానని విష్ణు ప్రకటించిన వెంటనే ‘మా భవనం కూడా నేనే కడతా’.. అని ప్రకటించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. మా ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటింగ్ 50 శాతం కూడా దాటడం లేదని విష్ణు గుర్తించాడు. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలనే పట్టుదలతో ముందుకు వెళ్ళాడు. మొదట తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో స్థిరపడి ఇక్కడికి రాలేని నటుల వివరాలను విష్ణు సేకరించాడు. అలాగే విదేశాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నాడు.

వారందరూ ఓటు వేయడానికి హైదరాబాద్ వచ్చేలా తగిన ఏర్పాట్లు చేశాడు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కావాలనుకున్నవాళ్ల అందరి తరఫున తనే రిటర్నింగ్ అధికారికి ఒక లేఖ రాసి వాళ్ళందరి ఫీజు కూడా తానే కట్టేసి ఒకరకంగా ఓట్లు తనకే పడేలా చూసుకున్నాడు. ఆ విధంగా ఎన్నికల స్ట్రాటజీని ఫాలో అయి విష్ణు విజయాన్ని అందుకున్నాడు.

ఎన్నికలకు చాలా సమయం ఉండగానే మా ఎన్నికలు నిర్వహించేది ఎప్పుడూ..అంటూ ప్రకాష్ రాజ్ నరేష్ ని తొందర పెట్టాడు. ఎన్నికలు జరపాలంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టాడు. మొదట్లో చూపించిన దూకుడు ప్రకాష్ రాజ్ ఆ తర్వాత ఎందుకో చూపించలేకపోయాడు. మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ నటులను వ్యక్తిగతంగా కలిశాడు. వారి మద్దతు కోరాడు. అందరూ ఓటేయడానికి వచ్చేందుకు కృషి చేశాడు. కానీ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రచారం చేశాడు.

కొంతమందికి విందు ఏర్పాటు చేసినప్పటికీ.. మంచు విష్ణు కూడా ఈ విషయంలో ప్రకాష్ రాజ్ కి ఏ మాత్రం తగ్గలేదు. మొత్తానికి మా ఎన్నికల్లో నటీనటులను ప్రకాష్ రాజ్ కలుపుకొని పోలేకపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన పలువురు సభ్యులు ప్రకాష్ రాజ్ తీరు కారణంగానే ఎన్నికల్లో తాము ఓడి పోవాల్సి వచ్చిందని ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి మద్దతు ఇచ్చిన ఏ ఒక్క అభ్యర్థి ఇప్పటివరకు మా ఎన్నికల్లో ఓడిపోలేదు. అలాంటిది మెగా మద్దతును కూడా ప్రకాష్ రాజ్ సరిగా ఉపయోగించుకోలేక పోయాడని విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఏకంగా పదకొండు మంది సభ్యులు గెలిచి ప్రకాష్ రాజ్ ఓడిపోయారంటే.. క్రాస్ ఓటింగ్ ఏ స్థాయిలో జరిగిందో, ప్రకాశ్ రాజ్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని, ఆయనకు పెద్దలంటే గౌరవం లేదని, క్రమశిక్షణ లేదని.. మంచు విష్ణు ప్రచారం నిర్వహించడం అతడికి కలిసొచ్చింది.

ఇక అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా.. ఉపాధ్యక్షుడిగా ఆయన ప్యానల్ కే చెందిన మాదాల రవి గెలిచాడు. జనరల్ సెక్రటరీగా కూడా విష్ణు ప్యానెల్ కు చెందిన రఘుబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన జీవిత రాజశేఖర్ పై విజయం సాధించాడు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యాడు. విష్ణు ప్యానెల్ తరఫున పోటీ చేసిన బాబు మోహన్ పై శ్రీకాంత్ విజయం సాధించాడు.

మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts