బాలుడు చేపలు పడుతుండగా అక్కడికొచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఓ బాలుడిని మొసలి మింగేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. కార్వార హళియాళ రోడ్డు అలైడ్ ప్రాంతానికి చెందిన మోహిన్ మహమ్మద్(15) సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు గాను కాళి నదీ తీరం వద్దకు వెళ్ళాడు. అక్కడ మోహిన్ మహమ్మద్ చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా మొసలి దాడి చేసి అతడి కాలును నోట పట్టుకొని నదిలోకి ఈడ్చు కెళ్ళింది.

సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనను చూసి అక్కడున్న వారు బిత్తరపోయారు. వెంటనే తేరుకొని రెండు మూడు తెప్పల్లో నదీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ బాలుడి ఆచూకీ కనిపించలేదు.

గజ ఈతగాళ్లు కూడా అక్కడికి చేరుకొని అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలుడి కోసం రెండు రోజులుగా గాలిస్తునప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. బాలుడిని మొసలి పూర్తిగా తినేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

కాళి నదిలో ఇటీవలి కాలంలో మొసళ్ళ సమాచారం అధికమైంది. దీంతో అధికారులు నది పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ మొసలి దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Share post:

Latest