ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

October 8, 2021 at 3:08 pm

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న తరువాత కమలం పెద్దలకు రాష్ర్టాల్లో పాగా వేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. కొన్ని చోట్ల సక్సస్ కూడా అయ్యారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా విజయం సాధించలేదని చెప్పవచ్చు. తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా టీఆర్ఎస్ పై పోరాడుతున్నారు. అందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నువ్వా.. నేనా అని పోటీపడి టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అధికార పార్టీని ఢీకొడుతుండటంతో అమిత్ షా కూడా తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు.

అయితే.. ఏపీలో మాత్రం పార్టీని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీలో కమలం పార్టీ గ్రాఫ్ పెద్దగా లేదు. ముందు తెలంగాణ.. ఆతరువాత ఏపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే జాతీయ కార్యవర్గ సభ్యుల నియామకం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐదుగురు నియమితులైతే తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ఒక్కరికి మాత్రమే స్థానం దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డిలను నియమించగా.. ఏపీ నుంచి కేవలం కన్నా లక్ష్మినారాయణను మాత్రమే నియమించారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా ఈటల రాజేందర్, విజయశాంతిలను తెలంగాణ నుంచి నియమించారు. ఈ నియామకాలను బట్టి చెప్పవచ్చు ఢిల్లీ పెద్దలు ఏపీని ఎలా చూస్తున్నారో.

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts