విజయాన్ని ఏకపక్షంగా నిందిస్తే ఆత్మవంచనే..!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయభారాన్ని మూటగట్టుకుంది. సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఓడిపోయిన పార్టీ.. తమ ఓటమిని ప్రజల తీర్పుగా అంగీకరించడం జరగదు. గెలిచిన పార్టీ చేసిన అక్రమాలకు ఫలితంగా అభివర్ణిస్తుంది. మామూలు పరిస్థితుల్లోనే అలాంటి కాకమ్మ కబుర్ల చెప్పే పార్టీల నేతలు.. ఈసారి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో, మెజారిటీ ఏకగ్రీవాలు కావడం, చాలా చోట్ల తెలుగుదేశానికి పోటీకి దింపడానికి అభ్యర్థి కూడా లేకుండా పోయిన పరిస్థితుల్లో గెలిచిన పార్టీ మీద నిందలు వేయకుండా ఎలా ఉంటాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది.

ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారు, అవి సెలక్షన్లే తప్ప ఎలక్షన్లు కాదు.. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా వైసీపీ విజయోత్సవ సంబరాలు చేసుకుంటోంది.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గుణపాఠం తప్పదు.. వంటి.. చేతగాని మాటలు ఓడిపోయిన తెలుగుదేశం నాయకుల నుంచి చాలా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. వైకాపాకు దక్కినది ఏకపక్ష విజయం. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేక.. ఏకపక్షంగా నిందించడానికి తెలుగుదేశం నాయకులు తెగిస్తున్నారు. సాహసిస్తున్నారు. ఇలాంటి ఏకపక్షమైన నిందలు.. ఆత్మవంచన అనిపించుకుంటాయే తప్ప.. తార్కికమైన విమర్శగా ప్రజలు గుర్తించరు అనే సంగతిని వారు తెలుసుకోవాలి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం మామూల్ది కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఉన్న నాలుగు జడ్పీటీసీ సీట్లనూ వైసీపీ గెలుచుకోవడం అంటే చిన్న సంగతి కాదు. 2014 ఎన్నికల నాటనుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ప్రభ ఏ రకంగా పలచబడుతున్నదో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా గణాంకాలు తోడుగా వెల్లడించారు. ఆ వివరాలు అన్నీ చూసుకుంటూ కూడా.. తమ పార్టీకి ప్రజాబలం సన్నిగిల్లుతున్నదేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయకుండా.. కేవలం అధికార పార్టీని నిందించి పబ్బం గడుపుకుందాం అనుకుంటే, అటువంటి ఆత్మవంచన తెలుగుదేశం పార్టీ పతనానికే దారితీస్తుంది.

స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్వాంటేజీ ఉండడం సహజం. అధికార పార్టీ మాట సాగుబాటు అయ్యే అవకాశం ఉంటుంది గనుక.. కొన్ని చోట్ల వారు ఓటర్లను ప్రభావితం చేసి విజయాలు నమోదు చేయగలరు. అంతే తప్ప.. ఇలా గంపగుత్తగా యావత్తు రాష్ట్రాన్ని చాపచుట్టినట్టుగా చుట్టేసి తమ చంకలో పెట్టుకోవడం కేవలం అధికారంలో ఉండడం వలన సాధ్యమయ్యే పని కాదు.

జడ్పీటీసీ స్థానాల్లో 2 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 20 శాతం విజయాలు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి దక్కలేదు. గెలిచిన వారి మీద నిందలు వేయడంతో సరిపెట్టుకోకుండా.. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజాభిమానం వెల్లువెత్తుతోందా? అనే కోణంలోంచి పరిశీలించి.. దానిని మించి ప్రజలను ఆకట్టుకోవడానికి తామేం చేయగలమో ఆలోచించగలిగితే తెలుగుదేశం ముందు ముందు బతికి బట్ట కడుతుంది.

Share post:

Popular