పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా..?

మూడు రోజుల కిందట ఒక తమాషా జరిగింది. సినిమా హీరో పవన్ కల్యాణ్, సినిమా డైరక్టర్/ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు అనడం కంటె.. పవన్ కల్యాణ్ శ్రీశ్రీ గురించి అడిగాడు.. త్రివిక్రమ్ తనకు తోచినదేదో చెప్పాడు అని అంటే బాగుంటుంది. వారిద్దరూ అలా శ్రీశ్రీగురించి మాట్లాడుకోవడమే.. ఒక ఘనకార్యం అన్నటలుగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయింది. పవన్ అభిమానులందరూ ఆహాఓహో అంటూ భజన చేశారు.

అంతా బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా పార్టీ విడుదల చేసిన వీడియోను గమనిస్తే.. పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా? అనే సందేహం ఎవ్వరికైనా కలగక మానదు.

ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తనను తాను చాలా గొప్ప సాహిత్య పిపాసిగా చెప్పుకుంటారు. తన ఇంట్లో వందల వేల పుస్తకాలు ఉంటాయని కూడా ఆయన చెబుతుంటారు. దానికి తోడు పార్టీ కార్యక్రమాలకు విజయవాడ వంటి చోట్లకు వెళ్లినప్పుడు.. ప్రత్యేకంగా పుస్తకాల విక్రయించే షాపులకు వెళ్లి.. పెద్దసంఖ్యలో కొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇన్నిరకాలుగా పవన్ కల్యాణ్ తనలోని పుస్తకప్రేమను బయటపెట్టుకుంటూ ఉంటారు. ఆయన ఫాంహౌస్ దాటకుండా అజ్ఞాతంగా ఉండే రోజుల్లో పార్టీ.. ఆయన ఫోటోలు కొన్ని విడుదల చేసింది. వాటన్నింటిలో కూడా సాహిత్యపిపాసిలాగా చెట్లకింద కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉన్న ఫోటోలే ప్రముఖమైనవి.

పైగా పవన్ కల్యాణ్ తనకు తెలుగు ఆధునిక కవిత్వం మీద చాలా ప్రేమ చాలా పట్టు అని చెప్పుకుంటూ ఉంటారు. తన ప్రసంగాల్లో పదేపదే తెలుగు ఆధునిక కవితలను కోట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా సభను రక్తికట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ రకంగా ఇదంతా కలిపి చూసినపపుడు.. పవన్ కు సాహిత్యం మీద చాలా జ్ఞానం ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.

కానీ ఈ వీడియోలో.. శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం పేజీలు తిప్పుతూ… ఒక పేజీలో ఫోటో చూడగానే.. ‘ఈయనెవరు శ్రీశ్రీనా’ అని పవన్ అడగడం ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజానికి ఆ పేజీలో ఉన్నది కొంపెల్ల జనార్దనరావు ఫోటో. ‘కొంపెల్ల జనార్దనరావు కోసం..’ అనే కవిత శ్రీశ్రీ మహా ప్రస్థానంలో చాలా ముఖ్యమైన కవిత. ఆ కవిత ఉన్న పేజీలో సదరు జనార్దన రావు ఫోటో వేశారు.

ఆ పేజీలోకి రాగానే.. ‘ఈయనెవరు శ్రీశ్రీనా’ అని పవన్ అడగడం చూస్తే ఎవరైనా విస్తుపోతారు. వెంటనే పక్కన ఉన్నవారు కాదండీ.. ఆయన కొంపెల్ల జనార్దనరావు అంటూ సర్ది చెప్పారు.

ఈ ఒక్క ప్రశ్నతో పవన్ కల్యాణ్ కు శ్రీశ్రీ అంటే అసలు ఎలా ఉంటాడో తెలియనే తెలియదు అని మనకు అర్థమైపోతుంది. తెలుగు కవిత్వం అంటే తనకు పిచ్చి, ప్రాణం అని చెప్పుకునే ఒక నటుడు, రాజకీయ నాయకుడు.. ఈ శతాబ్దం నాది అని చాటుకున్న శ్రీశ్రీ కవిత్వం చదవకపోతే పాయె.. కనీసం ఆయన ఫోటో ఎలా ఉంటుందో కూడా తెలుసుకోడా? అనే అభిప్రాయం కలగుతుంది.

శ్రీశ్రీకవిత్వం చదవని చాలా మందికి కూడా, తెలుగురాష్ట్రాల్లో చాలా మంది చిన్నపిల్లలు యువకులకు కూడా.. మహాకవి శ్రీశ్రీ ఎలా ఉంటాడో తెలుసు. ఆయన బొమ్మ తెలుసు. పవన్ కల్యాణ్ కుమాత్రం తెలియదు. ఇది చూస్తే పవన్ కు మరీ అంత అజ్ఞానమా అనే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది.?

https://youtu.be/AU-evL-b9Tw