డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?

ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ తేదీన జరగాల్సిన మీటింగ్ అకారణంగా వాయిదా పడింది. ఎందుకు, ఏమిటి అనే విషయాలు ఎవరికీ తెలియదు. సర్కారుకు తప్ప.. సినీ పెద్దలకు ఈ విషయంపై పెద్దగా క్లారిటీ లేదు. ప్రభుత్వం కూడా చెప్పదలచుకోలేదేమో..

ముఖ్యంగా ఏపీలో థియేటర్ టికెట్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓనే సినీ పెద్దలకు కునుకు రాకుండా చేస్తోంది. టికెట్లు ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అనేది సర్కారు వాదన. అయితే తక్కువ ధరలో టికెట్లు ఉంటే డబ్బు రావడానికి సమాయం పడుతుందనేది పరిశ్రమ అభిప్రాయం. అందుకే ఇపుడు ఈ భేటీ. సినీ పరిశ్రమ మొత్తం జగన్ తో సమావేశంపై ఎదురు చూస్తోంది. ఈనెల 20న తాడేపల్లిలోని జనగ్ నివాసంలో భేటీ జరుగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులతో కూడా చిరంజీవి టచ్ లో ఉన్నట్లు తెలిసింది. అవసరమైతే ఈ రీల్ హీరోలంతా అమరావతికి వెళ్లే అవకాశముంది. అందుకు సిద్ధంగా ఉండాలని మెగాస్టార్ సూచించారట. వాళ్లు కూడా పాజిటివ్ గానే స్పందించారు. అన్నీ సవ్యంగా అనుకున్నట్లు జరిగితే ఈనెల 20న జరిగే సమావేశంలో టికెట్ ధరలపై సర్కారు ఓ నిర్ణయం తీసుకోవచ్చు.