ఎంపీ మార్గానిపై ఆర్ ఆర్ ఆర్‌.. స‌టైర్లు.. ఓ రేంజ్‌లో…!

వైసీపీ యువ‌నేత‌, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజ‌మండ్రి ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మార్గాని భ‌ర‌త్‌పై సొంత పార్టీ ఎంపీ.. న‌ర‌సాపురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ర‌ఘురామ కృష్ణ రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఏక చిత్ర న‌టుడు.. ద్విపాత్రాభిన‌యం“ అంటూ.. సైట‌ర్లు కుమ్మేశారు. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జోరు కొన‌సాగింది.

ప‌రిష‌త్ ఎన్నిక‌లను టీడీపీ బ‌హిష్క‌రించ‌డం కావొచ్చు.. లేదా.. మ‌రే కార‌ణ‌మైనా కావొచ్చు.. వైసీపీ దూకుడు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప‌రిష‌త్‌ల‌ను సొంతం చేసుకుంది. వేల సంఖ్య‌లో ఎంపీటీసీ ల‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే.. టీడీపీ బ‌హిష్క‌రించినా.. ఆ పార్టీ నాయ‌కులు నామినేష‌న్లు వేసిన త‌ర్వాత‌.. వైసీపీలో చేరిపోయినా.. ప్ర‌జ‌లు మాత్రం కొన్ని చోట్ల టీడీపీకి ప‌ట్టం క‌ట్టారు. అదేవిధంగా ఏమీ లేద‌ని అనుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన కూడా కొన్ని చోట్ల పుంజుకుంది. జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థ‌లు విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఎంపీ మార్గాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజ‌మండ్రి ప‌రిధిలోని ఆయ‌న స్వ‌గ్రామంలో వైసీపీ అభ్య‌ర్థి ఓడిపోయి.. అక్క‌డ భారీ మెజారిటీతో జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంది. ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా ఎంపీకి ఇబ్బందిగా మారింది. ఇంటా బ‌య‌టా కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఇటీవ‌ల కాలంలో వైసీపీ లోపాల‌ను ఎండ‌గ‌డుతున్న సొంత ఎంపీ.. ర‌ఘురామ కూడా దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో ఒక చిత్రంలో నాయ‌కుడిగా న‌టించిన మార్గానిని అదే సినిమాతో ఏకేశారు. “ఏక చిత్ర న‌టుడు చేసిన ద్విపాత్రాభిన‌యం ర‌క్తిక‌ట్ట‌లేదు.. ఆయ‌న‌కు నా నియోజ‌క‌వ‌ర్గం కూడా అప్ప‌గిస్తే బాగుంటుంది!. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజ‌మండ్రిలోనే వైసీపీని గెలిపించుకోలేక పోయారు“ అంటూ. విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కు పెట్టారు. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.