కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!

పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా హుసేన్ సాగర్ అందాన్ని, శుభ్రతను కాపాడడానికి అడ్డుగా నిలిచేవి. ప్రభుత్వం కోట్లకు కోట్ల రూపాయలు వెచ్చించి.. హుసేన్ సాగర్ ను శుభ్రపరిచే ప్రాజెక్టు చేపడుతూనే ఉన్నది గానీ.. ఫలితం మాత్రం సున్నా. ఎంతో అందంగా కనిపించే హుసేన్ సాగర్ తీరంలో నిల్చోవాలన్నా.. మధ్యలో కొలువైన బుద్ధుడి సమీపానికి వెళ్లాలన్నా భయంకరమైన దుర్గంధాన్ని భరించాల్సిందే. అయితే దీనిని శుభ్రపరిచి ఆహ్లాదకరమైన మంచినీటి సరస్సులా తయారుచేయాలన్న కేసీఆర్ స్వప్నం తీరే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా.. ఈ స్వప్నం నెరవేరడానికి హైకోర్టు తీర్పు ఉపకరించే అవకాశం కనిపిస్తోంది.

పీఓపీ, సింథటిక్ రంగులు వాడిన వినాయక విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఈ ఒక్క ఏడాదికి అనుమతించాలని, నిమజ్జనం కోసం నగరంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన బేబీ పాండ్స్ సౌకర్యంగా లేవని.. జీహెచ్ఎంసీ చేసిన విన్నపాలను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారని గద్దించింది. ఇరవయ్యేళ్లుగా ఇదే మాటలు చెబుతున్నారని ఆగ్రహించింది. కావలిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లండి గానీ.. అనుమతించేది మాత్రం లేదని కొట్టిపారేసింది.

ఈ విషయమై కేసీఆర్ అధికారులతో సమాలోచనలు కూడా జరిపారు. సుప్రీం కోర్టుకు వెళ్లాలా వద్దా మల్లగుల్లాలు పడుతున్నారు. సుప్రీంకు వెళ్లినా సరే.. తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదు. పర్యావరణానికి హాని చేసే ఎలాంటి నిర్ణయాన్నీ ఏ కోర్టూ కూడా సమర్థించదు. పైగా నగరం నడిబొడ్డున ఉండే అతిపెద్ద హుసేన్ సాగర్ విషపూరితం అయిపోయే నిర్ణయాలను ఏమాత్రం అనుమతించరు.

ఏ రకంగా చూసినా.. ఈ ఏడాదికి హుసేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం లేనట్లే. గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రభుత్వాన్ని తూర్పారపట్టకుండా ఉండేందుకు తెరాస ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయిస్తే ఆశ్రయించవచ్చు గానీ.. వాస్తవంలో వారికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఆ రకంగా.. మరి కొన్నేళ్లపాటూ ఈ విషపూరిత విగ్రహాల నిమజ్జనం జరగకపోతే.. హుసేన్ సాగర్ ను అందాల కాసారంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ స్వప్నం తప్పకుండా నెరవేరుతుంది.