ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వైఎస్ఆర్ వర్ధంతి అయిన సెప్టెంబరు 2ను ఖరారు చేశారు. ఆ సమావేశం నిర్వహించేది ఏపీలో కాదు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో. లోటస్ పాండ్ లోని నివాసంలో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అప్పటి వైఎస్ సహచరులు కేవీపీ, డీ.శ్రీనివాస్, సురేష్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులకు విజయమ్మ ప్రత్యేకంగా ఫోన్ చేసినట్లు తెలిసింది.

సమావేశం వెనుక కారణమేంటో..

ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ 2009 సెప్టెంబర్ 9న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయిన తరువాత అదీ 12 సంవత్సరాల తరువాత వైఎస్ సమకాలీకులతో సమావేశం కావడమే ఇపుడు చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రాధాన్యత లేదు అని విజయమ్మ మద్దతుదారులు చెబుతున్నా.. అంతమంది నాయకులు వస్తే రాజకీయాలు కాకుండా ఏముంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూతురు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ ని స్థాపించి ముందుకు వెళుతున్నారు. వైటీపీ ఆవిర్భావ సమావేశానికి విజయమ్మ కూడా వచ్చి మద్దతు పలికారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ వైటీపీ సమావేశానికి రావడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇవన్నీ ఆమె పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. షర్మిలను రాజకీయంగా బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సమావేశం అని తెలుస్తోంది. వైఎస్ సహచరులను పిలిచి పార్టీలోకి నేరుగా ఆహ్వానించకపోయినా.. పార్టీ బలోపేతానికి తగిన సూచనలు, సలహాలు కోరాలని అనుకుంటున్నట్లు సమాచారం. జగన్ సీఎం అయిన తరువాత వైఎస్ సహచర మంత్రులను, నాయకులను పట్టించుకోకపోయినా తాను పట్టించుకుంటున్నా అనే భావన వారిలో కలిగించేలా ఈ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైటీపీకి మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం. వీరి ద్వారా ఓ స్థాయి ఉన్న నాయకులకు పార్టీ కండువా వేయించాలనే ప్లాన్ ఉన్నట్లు తెలిసింది. ఎందుకు, ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబరు 2 వరకు వేచి చూడాల్సిందే.