ఆర్ఆర్ఆర్ తేడా కొడితే ఏమిటి పరిస్థితి?

టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీలోకం ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌తోనే సగం క్రేజ్ లాగేసిన జక్కన్న, ఈ సినిమాతో ఎవరికీ సాధ్యం కానీ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు.

ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథను ఫిక్షనల్ రూపంలో చూపించి ఔరా అనిపించాలని జక్కన్న తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌తో కొమురం భీం పాత్ర చేయిస్తుండగా, రామ్ చరణ్‌తో అల్లూరి సీతారామరాజు పాత్ర చేయిస్తున్నాడు. నిజానికి ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ వారిని కలిసి మనకు చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్ అంటున్నాడు ఈ డైరెక్టర్. ఇంతవరకు బాగానే ఉన్నా, ఎందుకో సినిమాను బూతద్దంలో పెట్టి చూసేవారికి ఈ సినిమా కాస్త తేడానే కొడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలు చేసే పోరాటాలు అప్పట్లో ఆ స్థాయిలో జరిగినవి కావని, ఇక గ్రాఫిక్స్ వాడి మరీ యుద్ధ సన్నివేశాలు చూపించాల్సిన అవసరం కూడా లేదని వారు వాదిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ గురించి కొందరు క్రిటిక్స్ అప్పుడే కామెంట్ చేస్తున్నారు. కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల ప్రేమగాధను రాజమౌళి ఎలా చిత్రీకరిస్తాడా అని వారు ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా వీటిలో ఏ ఒక్క అంశం కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రభావం చూపితే ఏమిటి పరిస్థితి అని వారు అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే చిత్రంలో కొత్తదనం ఏమీ లేకపోతే సాధారణ ఆడియెన్స్ ఈ సినిమాను ఎంతమేర ఆదరిస్తారనేది కూడా ముఖ్యమైన పాయింట్. మరి ఇన్ని అంశాలను రాజమౌళి ఏ విధంగా పరిగణలోకి తీసుకుని సినిమాను తీస్తున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగక తప్పదు.

Share post:

Latest