అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు పార్టీలోకి వెళుతున్నారు అని ఎవరైనా చెబుతారు. ఓకే.. ఇది ప్రజాస్వామ్యం.. ఎవరు ఏ పార్టీలోకి అయినా వెళ్లవచ్చు అని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో అగమ్యగోచరంగా ఉంది. ఒక్క రేవంత్ రెడ్డి తప్ప పార్టీలో వాయిస్ ఉన్న నాయకులు లేరు.. దీంతో నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. అలాగే సర్వే కూడా కారువైపు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా గతంలో ఆయన బీజేపీలోకి వెళుతున్నారు అని కూడా ప్రచారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా కలిశారు. మరి వారి మధ్య చర్చలు ఏం జరిగాయో.. ఏమో మాత్రం ఆ ప్రపోజల్ అప్పట్లోనే ఆగిపోయింది. బీజేపీలో ఉంటూ కేసీఆర్ ను మెచ్చుకొని ఇంకా టీఆర్ఎస్ పార్టీలో చేరకుండానే మోత్కుపల్లి దళితబంధు చైర్మెన్ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్ద ఎత్తున అనుచరగణం, ఓటు బ్యాంకు కలిగిన సర్వే టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయనకు కేసీఆర్ ఏ పదవి ఇస్తారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.