సభకు నేను రాలేను బాస్.. గోవా వెళుతున్నా..

ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో కూడా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ను విమర్శిస్తూ దూకుడు పెంచింది. అయితే రేవంత్ లీడర్షిప్ లో సభలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హాజరుకాకుండా తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇపుడు ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికే ఫోన్ చేసి ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహేంచే సభకు తాను రాలేనని, గోవా టూర్ వెళుతున్నానని చెప్పారు. పార్లమెంట్ స్టడీ టూర్ ఉన్నందున ఆ కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పారు. ఇలా రేవంత్ తో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.

ముందునుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధిష్టానానికి అనుకూలంగా ఉంటున్న తనను కాదని నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరిన రేవంత్ కు రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక తున్నారనేది బహిరంగ రహస్యం. రేవంత్ పై ఓటును నోటు కేసు ఉందని, ఇది పార్టీ పరువును దెబ్బతీస్తుందని ఢిల్లీ పెద్దలతో కోమటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. అయినా రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ నే నమ్మారు..ఆయనకే పట్టం కట్టారు. దీంతో వెంకటరెడ్డి చేసేది లేక రేవంత్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్ లో నిర్వహించే సభలు, సమావేశాలకు కూడా కోమటిరెడ్డి రావడం లేదు. ఆయనలోని కోపాన్ని పోగొట్టేందుకు రేవంత్ కలిసేందుకు ప్రయత్నించినా తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇబ్రహీం పట్నం భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో.. దళితగిరిజన ఆత్మగౌరవ సభను మహేశ్వరంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని రేవంత్ పరిశీలిస్తున్నారని తెలిసింది.