జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?

అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత

రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది. అందుకే రాజకీయ నాయకులు నిర్ణయాలు త్వరగా తీసుకోరు.. తీసుకున్నా అమలు చేయరు.. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన నాయకులు ఎన్టీయార్, నరేంద్రమోదీ.. ఇపుడు వారిని మించి జగన్ పొలిటికల్ గేమ్ ఆడబోతున్నాడు. చూసేవారికి వారి బాటలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళుతున్నారేమో అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే వారిని మించి ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు జగన్.

ఎన్టీయార్ హయాంలో ఏం జరిగిందంటే..

గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీయార్ అధికారంలో ఉన్నపుడు నాదేండ్ల భాస్కర్ రావు యాక్టివ్ అయ్యారు. ఎన్టీయార్ లేని సమయం చూసి సీఎం సీటులో కూర్చున్నారు. ఆ తరువాత ప్రజావ్యతిరేకత రావడంతో తిరిగి ఎన్టీయార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఈ ఎపిసోడ్ అయిన తరువాత సీఎం తన మంత్రివర్గ సహచరులను మార్చాలని నిర్ణయించారు. అనేకమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావించి వారి అడ్డు తొలగించుకోవాలని భావించారు. అందుకే సగానికి సగం మంది కేబినెట్ మంత్రులను పదవులనుంచి తొలగించి తనకు నచ్చిన వారిని, తన విధేయులను నియమించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అసమ్మతి కారణంగా ఎన్టీయార్ అధికారాన్ని కోల్పోయారు.

ఇపుడు మోదీ ఏం చేశారంటే..

బీజేపీలో సూపర్ పవర్ అయిన నరేంద్ర మోదీ పార్టీలో ఎంత చెబితే అంత అన్నది బహిరంగ రహస్యం. ఇటీవల మోదీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. కొందరిని ఇంటికి పంపారు.. మరికొందరికి అప్రాధాన్య శాఖలు కేటాయించారు. పార్టీలో మోదీకి ఉన్న పట్టు కారణంగా ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు. అసమ్మతి కూడా బయటకు రాలేదు. వారికి అధిష్టానం అప్పగించిన పని చేసుకుంటూ వెళుతున్నారు. చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇది మోదీ స్టైల్..

జగన్.. డిఫరెంట్

మరి వైసీపీ అధినేత జగన్ ఏం చేయబోతున్నారు. వైసీపీలో జగన్ ఎంత చెబితే అంత.. ఎవరూ కాదనరు. అందుకే మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. ఈ విషయం సీఎం సీటులో కూర్చున్నపుడే చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సరిగా పనిచేయని మంత్రులను తొలగిస్తే అసమ్మతి రాకుండా ఉంటుందా? అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది సీనియర్ నాయకులు. వారిని తొలగించి కొత్త వారికి స్థానం కల్పిస్తే వారి జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటనేది జగన్ కు ఇప్పటికే ఓ అంచనా కూడా ఉంటుంది. అయితే.. జగన్ అందరిలా రాజకీయ నాయకుడు కాదు. డిఫరెంట్ పొలిటీషియన్.. కార్పొరేట్ స్టైల్.. ఆయన ఆలోచనే కొత్తగా ఉంటుంది. ఇపుడు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కూడా అదే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

అందరికీ అవకాశం ఇచ్చేందుకు..

రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గాన్ని మారుస్తాను జగన్ అని చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఎందుకు ఇలా చెప్పారు అనేది ఎవరూ పెద్దగా ఆలోచించరు. అందరూ.. అరె ఆయన మంత్రి పదవి తీసేస్తారట అనే విషయం ఆలోచిస్తున్నారు కానీ.. కొత్త వారికి అవకాశం ఇస్తున్నాడని ఎవరూ ఆలోచించరు. ఇదీ జగన్ చేస్తున్న పని.. ఇదే ఆయన ఆలోచన.. గతంలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. అందరికీ అవకాశం రాలేదు. ఇపుడు ఉన్న వారిని తొలగించి కొత్త వారికి చాన్స్ ఇస్తున్నాడు. పాతవారిని బుజ్జగిస్తున్నాడు. దీంతో అందరూ మంత్రులైనట్లు ఉంటుంది.. అందరూ శాటిస్ఫై అవుతారు. ఇదీ జగన్ ప్లాన్.