హైదరాబాద్ లో కదిలిన ’బండి‘..కమలంలో ఉత్సాహం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసుతన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యకర్తల కోలాహలం మధ్య బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బండి పాదయాత్రకు బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా మంది సీనియర్లు ఆయనకు సహకరించడం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి అంచనాలు తారుమారు చేస్తూ యాత్రకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ యాత్రకు ఇంకా అనుమతివ్వలేదనే వార్తలు శుక్రవారం రాత్రి వరకు చక్కర్లు కొట్టాయి. అయితే అనుకున్న సమయానికే టీబీజేపీ చీఫ్ యాత్ర మొదలైంది.

అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్, నాయకులు అరుణ్ సింగ్, డీకే అరుణ, డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పాదయాత్రలో బండి సంజయ్ కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా కుటుంబపాలన, అవినీతి గురించి ప్రసంగించనున్నారు. మొదటి రోజు ఈ యాత్ర అఫ్జల్ గంజ్, నాంపల్లి ఎగ్జిబిషన్, లక్డీకపూల్, మెహిదీపట్నం వరకు సాగుతుంది. మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో రాత్రి బస చేయనున్నారు. అసలు బండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుందో లేదో అనుకున్న కార్యకర్తలు ఇపుడు జోష్ లో ఉన్నారు. సిటీలో ఎటు చూసినా కమలం కనిపిస్తోంది. బండి చేసే విమర్శలకు ప్రభుత్వ పెద్దలు ఏమని బదులిస్తారో రేపటి నుంచి చూడాలి.