పోటీలో ఉన్నాం.. సరే పరిగెత్తడం ఎలా.. గెలిచేదెలా..?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక రకమైన నిస్తేజం నెలకొంది. అధికార పార్టీ రాష్ట్రంలో పరుగెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం కనీసం నడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు.  పార్టీకి కేడర్ లేదా అంటే బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అనే చెప్పవచ్చు. మరి ఎందుకిలా జరుగుతోంది అంటే  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడే అని చెప్పవచ్చు. యువతరంతో పోటీ పడాలంటే యువకులే ఆలోచించాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ పార్టీ మిస్సైల్ లా దూసుకువెళుతుంటే చంద్రబాబు చేద్దాం.. చూద్దాం అంటూ కాలం గడుపుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల తరువాత చాలా మంది నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల కండువాలు కప్పుకున్నారు. అయినా.. 2024 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే కనీసం ఇప్పటినుంచే ఆలోచించాలి. పార్టీకి సలహాలిచ్చి స్పీడ్ రిజల్ట్స్ వచ్చే ఎక్స్ పర్ట్ ను ఏర్పాటు చేసుకోవాలి.  ఆల్రెడీ రాబిన్ శర్మ ఉండనే ఉన్నాడు. అయితే 2019 ఎన్నికలకు ఈయనే పోల్ మేనేజ్ చేశారు.  ఫలితం మాత్రం రాలేదు. ఈసారి కూడా పార్టీ అధ్యక్షుడు ఈయననే నమ్ముకున్నాడు.  నారా లోకేష్ కూడా బెస్ట్ అడ్వైజర్ కోసం లోకమంతా వెతుకుతున్నాడు.ఇంతవరకు ఆయనకు ఎవరూ కనిపించలేదు.  సమయమేమో మించిపోతోంది.. ఉన్నది కేవలం రెండున్నరేళ్లే.. ఇప్పటినుంచే కష్టపడితే తప్ప ఫలితాలు రావు. కేవలం సోషల్ మీడియానే నమ్ముకొని విమర్శలు చేస్తుంటే జనమూ నమ్మరు. వీధుల్లోకి రావాలి.. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను నిరసించాలి.. అరెస్టులు కావాలి.. ఇన్ని చేస్తేనే జనం నమ్ముతారు.. లేకపోతే అంతే..!