సోనూసూద్.. కరోనా వచ్చిన తర్వాత దేశమంతటా మారుమోగిపోతున్న పేరు ఇది. కరోనా విపత్కర సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయపడి ఆపద్భాందవుడిగా మారాడు.
ఈ క్రమంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ ఆరాటపడుతుండడంతో.. సోనూసూద్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో.. ఆయన హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలోనే సోనూసూద్ హైదరాబాద్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఎక్కువగా ఆఫర్లు వస్తోన్న కారణంతోనే బంజారాహిల్స్‌లో సోనూ రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారట. అంతేకాదు, త్వరలోనే కొత్త ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.