ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం.

ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ఇక ఈయన రాజకీయ ప్రయాణంపై అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేస్తారు అని కొందరంటే..లేదు కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీలో చేరి దళితుల అభ్యున్నతికి పాటుపడతారని ఇంకొందరు అంటున్నారు.

అయితే ఆయన మాత్రం తాను ’ అంబేడ్కర్, పూలే, కాన్షీరామ్ ఆదేశాల మేరకు పనిచేస్తానని చెబుతున్నారు. అంటే ఇన్డైరెక్టుగా బీఎస్పీలో చేరుతారు అని తెలుస్తోంది. ఒక వేళ కేసీఆర్ సూచన మేరకు గులాబీ కండువా కప్పుకొని హుజూరాబాద్ లో పోటీచేసే విషయమూ తీసివేయలేము అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆయన మదిలో ఏముందో.. ఏ పార్టీలో చేరతారో.. లేక కొత్త పార్టీనే ఏర్పాటు చేస్తారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

Share post:

Latest