ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో అద్భుత క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన ఈయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ ఎంతో కొత్త‌గా, పెయిన్ ఫుల్‌గా ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్‌ ఏ తరహా పాత్రల్లో నటిస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు? అని ప్రశ్నించ‌గా.. అందుకు ఆయ‌న ఆస‌క్తికర కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్‌ రౌద్రరసం అద్భుతంగా పలికించగలరు. అలాగే హాస్యం, శృంగారం పలికంచగలరు. అన్నిటికంటే గొప్పది కరుణరసం. ఎందుకంటే, ఎవరైతే ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించగలరో, వాళ్లు గొప్ప నటులు. కరుణ రసం పలికించగల గొప్ప‌ నటుడు ఎన్టీఆర్‌. అంత కెపాసిటీ ఆయ‌న‌కు ఉంది. కానీ, అటువంటి పాత్ర చేయలేదు. చేస్తే చూడాలని ఉంది అని విజయేంద్రప్రసాద్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.