క‌రోనా ఉధృతి.. బ్యాంకుల కీల‌క నిర్ణ‌యం..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా త‌మ ప‌నివేళ‌ల‌ను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు మాత్రమే పనిచేస్తాయని స్ప‌ష్టం చేసింది.

ఇక నేటినుంచి మే 15వ తేదీ వరకు ఈ కుదించిన వేళలు అమలులోకి రానున్నట్లు ఆ క‌మిటీ వెల్ల‌డించింది. బ్యాంకులో జరిగే లావాదేవీలన్నీ య‌థావిధిగా కొనసాగుతాయని, కానీ అత్యవసర సేవలు అవసరమైతే తప్ప బ్యాంకుకి రావద్దని కూడా కోరింది. కరోనా కట్టడి చర్యలో భాగంగా ప్రతి ఒక్క బ్యాంక్ ఉద్యోగి కరోనా టీకా తీసుకోవాలని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. ఇదిలా ఉండ‌గా కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో అదీ ఒక్క ఎస్ బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కరోనా బారిన ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ సందర్భంగా ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ఇటీవ‌ల‌నే ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్‌ భారీన పడుతున్నారు’’ అని తెల‌ప‌డంతో పాటు, ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని ఆయన వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజా ప‌నివేళ‌ల‌ను సైతం కుదించిన‌ట్లు బ్యాంక‌ర్ల క‌మిటీ తెల‌ప‌డం గ‌మ‌నార్హం.