వార‌సుడిని క‌నివ్వ‌లేద‌ని భార్య‌పై యాసిడ్ దాడి..!

సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత పెరుగుతున్నా ఇంకా సామాజిక రుగ్మ‌త‌లు మాత్రం తొల‌గ‌డం లేదు. ఆడ‌వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీ,పురుషుల లింగ నిర్ణ‌యంలో మ‌హిళ‌ల పాత్ర ఏమీ లేద‌ని శాస్త్ర విజ్ఞానం రుజువు చేస్తున్నా కొంద‌రు ఇంకా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆ సాకుతో అతివ‌లను మాన‌సిక‌, శారీర‌క హింస‌కు గురిచేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. త‌న‌కు మ‌గ‌పిల్లాడిని క‌నివ్వ‌లేద‌ని ఆక్రోశంతో భార్య‌పై యాసిడ్ పోసి త‌న పైశాచిక‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు ఓ భ‌ర్త‌. ఈ సంఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే..

పంజాబ్ రాష్ట్రం పాటియాలా జిల్లాలో నౌగవనం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి చాలా కాలం క్రితమే పెళ్లయింది. అయిదేళ్ల, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. తనకు మగబిడ్డను కనివ్వమంటే ఆడ పిల్లను కనిచ్చావంటూ ఆ భర్త సూటి పోటి మాటలతో దూషిస్తూ భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ వేధింపులను తట్టుకోలేని ఒకటి రెండు సార్లు పంచాయితీ కూడా పెట్టించింది భార్య‌. అయినప్పటికీ అతగాడిలో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం భార్య‌తో మ‌రోసారి ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు, ఇతరులతో అక్రమ సంబంధం ఉందంటూ ఆమెను దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టడు. అక్క‌డితో ఆగ‌కుండా ముందుగానే తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ ను పోయ‌డంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. స్థానికులు గ‌మ‌నించి వెంట‌నే ఆమెను రక్షించి వైద్య‌శాల‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందనీ, 60శాతం ఆమె శరీరంపై యాసిడ్ గాయాలు అయ్యాయని వైద్యులు చెబుతున్నారు.

Share post:

Popular