కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728.. బీజేపీకి 56.. కాంగ్రెస్కు 29 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదీగాక ఇందులో 10ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎంపీగా ఓటమి చెందిన‌ ఇందూరు నుంచే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నెల 14న తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. అదేరోజున ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. క‌విత అఖండ విజ‌యం సాధించి పున‌రాగ‌మ‌నం చేయ‌డంతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో విష‌యం జోరుగా ప్ర‌చారం సాగుతున్న‌ది. తెలంగాణ మంత్రి వ‌ర్గంలోకి చేర‌నున్నార‌ని వార్త‌లు బ‌లంగా వినిపిస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కవిత మండలి ఎన్నికపై రాజకీయ నేత‌ల్లో ప్ర‌స్తుతం జోరుగా చర్చ కొన‌సాగుతున్న‌ది. కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక రహస్యం ఏంటన్నది అంద‌రి మదిని తోలుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే క‌విత‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదీగాక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీగాల గణేష్‌ గుప్తా, షకిల్‌, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని వ్యాఖ్యానించడం ఆ వాద‌న‌కు బ‌లం చేకూర్చాయి. క‌విత ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది. అప్పటి వరకు కవిత ఎమ్మెల్సీగానే కొనసాగుతురా? లేక మంత్రివర్గంలో చేరతారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టీఆర్ ఎస్ నేత‌ల వ్యాఖ్య‌లే కాదు కేసీఆర్ కూడా ప‌లు సంద‌ర్భాల్లో త‌నయకు మంత్రి ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నించిన కేసీఆర్‌ ప్రయత్నాలు విఫల‌మ‌య్యారు. ప్ర‌స్తుతం బీజేపీతో సై అంటే సై అంటున్నారు. దీంతో భ‌విష్య‌త్‌లోనూ ఆ అవ‌కాశం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మండలికి ఎంపిక చేసి రాష్ట్ర కేబినెట్‌లో చోటుకల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంది. ఒకవేళ కవితను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే అందులో ఎవరో ఒకరని తప్పించక తప్పదు. ఆ సాహసం కేసీఆర్ చేస్తారా? ఒక‌వేళా చేసినా ఎవరిపై వేటు వేస్తారు? అనేది ప‌లువురు ప‌లువిధాలు చ‌ర్చించుకుంటున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కవిత కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదు. అయితే మంత్రివర్గంలో అవకాశం లేకపోతే కేబినెట్‌ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చకూడా కొన‌సాగుతుండ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముంద‌స్తుగా భారీ వ్యూహం ప్ర‌కార‌మే క‌విత‌ను ఎమ్మెల్సీ స్థానానికి పంపించార‌ని తెలుస్తున్న‌ది. అందుకు కారణాలు కూడా వేరేగా ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 2022లోనే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. కేంద్రం సైతం ఆ దిశ‌గానే పావులు క‌దుపుతున్న‌ది. ఇప్ప‌టికే గుజ‌రాత్ సీఎం అధ్య‌క్ష‌త‌న అందుకోసం ఏకంగా ఒక క‌మిటీని వేసిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కూడా కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. మ‌రోవైపు ప్ర‌స్తుతం త‌న‌యుకు ఏ ప‌ద‌వి లేక‌పోవ‌డంతో నిజామాబాద్ జిల్లాలో ఏ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేని ప‌రిస్థితి. దీంతో అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌విత‌ను స్వ‌ల్ప వ్య‌వ‌ధి మాత్ర‌మే ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. త‌ద్వారా క‌విత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌ట్టు సాధించేందుకు మ‌రో అవ‌కాశాన్ని కల్పించిన‌ట్లు స‌మాచారం. అదీగాక బీజేపీ ఎంపీ అర్వింద్‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చేందుకు కూడా ఈ పాచిక‌ను వేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. 2022 వ‌ర‌కు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండ‌బోదు. జ‌మిలి ఎన్నిక‌లు రాక‌పోతే ఎమ్మెల్సీ స్థానాన్ని మ‌రోసారి పొడ‌గించుకోవ‌చ్చు అనే యోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఏ విధంగా చూసినా కేసీఆర్ భారీ వ్యూహంతోనే క‌విత‌ను రంగంలోకి దింపార‌ని అర్థ‌మ‌వుతున్న‌ది. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల్లో జోరుగా చ‌ర్చ సాగుతున్న‌ది.