వచ్చే 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం మీద ఉన్న వైసీపీ అధినేత జగన్‌కి షాకిస్తున్నారు పార్టీ దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు. రెండు రోజుల కిందట విజయవాడలో గౌతంరెడ్డి, వంగవీటి రాధా కృష్ణల మధ్య జరిగిన ఘర్షణతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరువు పోయింది. అదేవిధంగా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైంది. దీనికి కూడా వర్గపోరు కారణమనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కుమ్ములాటలకు, రగడలకు జగనే కారణమని అంటున్నారు విశ్లేషకులు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టిన చర్యలే ఇప్పుడు వైసీపీ లో రచ్చ రోడ్డెక్కిందని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో నేతల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలోకి చేర్చుకున్నారు. ఇదే ఇప్పుడు ఆధిపత్య పోరుకు, ఆ తర్వాత వర్గ పోరుకు దారితీసింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నేతలు రోడ్డెక్కడానికి కారణమైందని అంటున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా జగన్.. ఇంచార్జుల సంఖ్యను పెంచారు. ఒక్కొక్క నియోజకవర్గంలో నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇది ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. ముఖ్యంగా 2019లో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల విషయంపైనా రగడ పడుతున్నారు.
విజయవాడలో జరిగిన సంఘటన కూడా దాదాపు ఇలాంటిదే. గౌతమ్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి కొంత ఖర్చు పెట్టుకున్నారు. అయితే, టీడీపీ నేత బోండా ఉమాపై ఘోరంగా ఓడిపోయారు. అయితే ఆయన స్థానంలో మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకోవడం గౌతమ్ కోపానికి కారణమయింది. అంతేకాదు, తాను మళ్లీ పోటీచేయాలని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని గౌతం రెడ్డి అనుకున్నారు. అయితే, మల్లాది రాకతో ఆయన ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఈ పరిణామమే ఏదో ఒక రకంగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురై.. వేరే పార్టీలోకి జంప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు గౌతం రెడ్డి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇదే పరిస్థితి దాదాపు 102 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెబుతున్నారు.
కాకినాడ విషయానికి వస్తే.. ఇక్కడ ముత్తా శశిధర్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్న తరుణంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరో ఇన్ ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికి ఇస్తారోనని వీరిద్దరి మధ్య పోరు సాగుతోంది. ఇది అనేక వివాదాలకు దారితీస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మరోవైపు జగన్ రాజకీయ సలహాదారు పీకే టీం సర్వేలు కూడా నేతల మధ్య ఆరాటాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇవ్వాలని ఆయన సిఫారసు చేస్తారోనని తెగ ఉత్కంఠగా వీరు ఫీలవుతుండడం, తమకు రాదేమోనని కంగారు పడుతుండడం కూడా వివాదాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జగన్ నియోజకవర్గాలపై పరిస్థితిని సమీక్షించి, తగిన చర్యలు చేపట్టకుంటే ఎన్నికల నాటికి పార్టీ మరింత డ్యామేజీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి జగన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.