ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని చాటింపు వేస్తున్న చంద్రబాబు సర్కారు పోలవరం విషయంలో తెర వెనుక ఏదో చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ 2018 నాటికి పోలవరం పూర్తి చేసి 2019 ఎన్నికల్లో దీనిని హాట్ టాపిక్ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతి సోమవారాన్నీ పోలవారంగా మార్చుకుని సమీక్షలతో దంచికొడుతున్నారు. ఇది పైకి కనిపిస్తున్న, పేపర్లలో ప్రచారంలో ఉన్న ప్రధాన విషయం. అయితే, దీనికి విరుద్ధంగా బాబు వ్యవహరిస్తున్నారని, పోలవరం పనుల్లో స్పీడ్ లేదని తెలిసి కూడా పైపైన అరుపులు కేకలతో సమీక్షలతో సరిపెడుతున్నారనే వాదన ఒకటి హల్ చల్ చేస్తోంది.
విషయంలోకి వెళ్తే.. పోలవరం పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాటవాస్తవమే. దీనికి సంబంధించి కేంద్రం పూర్తిగా నిధులు ఇవ్వాలి. అయితే, దీనికన్నా ముందే ప్రభుత్వం నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఈ సంస్థ టీడీపీ ఎంపీ రాయపాటికి సాంబశివరావు అల్లుడిది. అయినా కూడా కొన్నాళ్లు పోలవరం స్పీడందుకున్నా.. తర్వాత తర్వాత లేటవుతున్నాయి. ఈ విషయంలోనే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ స్పందించి కాంట్రాక్టు సంస్థను మార్చాలని బాబుకు సిఫారసు చేశారు. కానీ, బాబు సంస్థను మార్చకుండా దాస్ గారిని వేరే చోటకి మార్చారు.
దీంతో అసలు దీని వెనుక ఏదో జరుగుతోంది? అనే చర్చకు బలాన్ని చేకూర్చింది. సీఎం చంద్రబాబు ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే కంపెనీ తరపున ఆయనే అన్ని పనులు చూసుకోవటం మొదలుపెట్టారు. చివరకు సబ్ కాంట్రాక్టర్లను కూడా బాబే నియమించనా తెలుస్తోంది. కొన్ని పనులకు అయితే ప్రభుత్వం ఎదురు డబ్బులు పెట్టి.. ఆ పని పూర్తి చేసిన తర్వాత బిల్లులో ఆ మొత్తాన్ని జమ చేసుకుంది. ఇలా ఒక్క పోలవరంలోనే కాకుండా.. ట్రాన్స్ స్ట్రాయ్ కి ఇఛ్చిన ఓ భారీ రోడ్డు పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
వారం వారం పోలవరంపై సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంక్రీట్ పనులు ముందుకు సాగటం లేదని కొత్త పల్లవి అందుకున్నారు. నిజానికి కాంక్రీట్ పనులు ఆగిపోయి చాలా కాలమే అయింది. దీనిని కప్పిపుచ్చుకోవడం కోసం.. సమగ్ర నివేదిక అంటూ కొత్త వ్యవహారాన్ని బాబు తెరమీదకి తెచ్చారు. ఏదేమైనా పోలవరం విషయంలో పనులు జరగక పోవడానికి కాంట్రాక్టు సంస్థదే తప్పని అధికారులు చెబుతున్నా.. వాటిపై చర్య తీసుకోకుండా బాబు ఇలా లోపాయికారీగా వ్యవహరిస్తూ.. పనులు నత్త నడకన సాగినా ప్రకటనలతో సరిపెడుతుండడం వెనుక విషయం ఆయనకే తెలియాలి.