నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ ల‌కు వ‌ణుకు ఎందుకు..!

అవ‌ను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఇదే మాట‌వినిపిస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో జ‌రుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత ర‌ణ‌రంగంగా మార‌డం, అధికార‌, విప‌క్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవ‌డం, కామెంట్ల‌తోనే క‌త్తులు దూసుకోవడం వంటివి కామ‌నైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విష‌యాలే క‌నిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవ‌రిది? మెజారిటీ ఎంత‌? సెంటిమెంట్ బ‌లంగా ఉందా? నైతిక విలువ‌లు బ‌లంగా ఉన్నాయా? అంటూ ఒక్క‌టే ప్ర‌శ్న‌ల వ‌ర్షం. టీ కొట్టు నుంచి మొద‌లు పెట్టి.. బార్ వ‌ర‌కు చ‌ర్చంతా.. నంద్యాల‌.. నంద్యాల‌.. నంద్యాల‌!!

సో.. మ‌రి.. ప్ర‌జ‌లు దేనిమీద ఎక్కువ ఆస‌క్తి చూపిస్తారో.. మీడియా కూడా అటే ఫోక‌స్ పెడుతుంది క‌దా. ఇప్పుడు టీడీపీకి అనుకూల ప‌త్రిక‌గా ముద్ర‌ప‌డిన ఆంధ్ర‌జ్యోతి, వైసీపీ మౌత్ పీస్ సాక్షి ప‌త్రిక, చానెల్ కూడా నంద్యాల పోరుపై ప్ర‌త్యేక క‌థ‌నాల‌తో పిచ్చెక్కిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఈ రెండు మీడియా హౌస్‌లు.. విచిత్ర‌మైన క‌థ‌నాల‌ను ప్లే చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి తాము మ‌ద్దితిచ్చే పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి జ్యోతి చంద్ర‌బాబుకు అనుకూలంగా క‌థ‌నాలు రాస్తుంద‌ని అనుకోవ‌డం సాధార‌ణ‌మే. అయితే, నంద్యాల‌విష‌యంలో మాత్రం ఈ ద‌మ్మున్న ప‌త్రిక.. గోడ‌మీద పిల్లిలా ప్ర‌వ‌ర్తిస్తోంది. టీడీపీ ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌ని, బ్ర‌హ్మానంద రెడ్డి విజ‌యం ఖాయ‌మ‌ని ఎక్క‌డా ఖ‌చ్చితంగా చెప్ప‌డం లేదు. రాయ‌డ‌మూ లేదు.

నంద్యాలలో పార్టీ గెలుపుకోసం టీడీపీ త‌ర‌ఫున‌ పాతిక మంది ఎంఎల్‌ఎలు ప్రచారం చేస్తున్నార‌ని, అయినా కూడా టీడీపీలో తెలియని భయం నెలకొందని ఆంధ్రజ్యోతి-ఎబిఎన్‌ కథనం ప్ర‌సారం చేసింది. క్షేత్రస్తాయిలో వాస్తవాలకు అమరావతికి వస్తున్న నివేదికలకు మధ్యన అంతరం ఆందోళన కలిగిస్తున్నదని కూడా పేర్కొంది. టీమ్‌ స్పిరిట్‌ లోపించిందని, నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని తెలిపింది. ముఖ్యంగా ఏవీ సుబ్బారెడ్డి అంటీముట్టనట్టుగా వుండటం, భూమా కుటుంబం ఆయనను పట్టించుకోకపోవడం ఫ్రభావం చూపొచ్చని తెలుగుదేశం వర్గాలు అనుకుంటున్నాయట. గ్రామస్థాయి కార్యకర్తలను కలుపుకుని పోవలసిన అవసరం ఎక్కువగా వుందట. ఇలా ఏబీఎన్ క‌థ‌నం ఎక్క‌డా ధైర్యంగా టీడీపీ గెలుపును చెప్ప‌లేదు.

ఇక‌, సాక్షి విష‌యానికి వ‌స్తే.. ఆ మీడియా త‌న పార్టీ వైసీపీ గెలుపును ప్ర‌చారం చేయాలి. అయితే, దీనికి భిన్నంగా త‌ట‌స్తంగా వ్య‌వ‌హ‌రించింది. ఆదివారం ఆగష్టు 6వ తేదీన సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి విలువలే గెలవాలి అంటూ తన త్రికాలం రాశారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించడం ద్వారా జగన్‌ కొత్తవిలువలు నెలకొల్పారని పేర్కొన్నారు. పెరుగుతున్న జగన్‌ ప్రాబల్యానికి బలమైన శిల్పామోహనరెడ్డి సొంతబలం తోడైతే విజయం సాధ్యం అని పేర్కొన్నారు.

చివర భాగంలో కొచ్చే సరికి అన్ని చోట్లా గాని లేక ఫిరాయింపులు జరిగిన అన్ని చోట్లాగాని ఒకేసారి ఎన్నికలు జరిగివుంటే వైసీపీ విజయం ఖాయమై వుండేదని కాని ఒక్క నంద్యాలలోనే జరుగుతున్నందున చంద్రబాబు అలవాటైన రీతిలో సకల హంగులూ శక్తియుక్తులూ మోహరించారని పేర్కొన్నారు. ఇలా.. ఈయ‌న కూడా ఎక్క‌డా వైసీపీ గెలుపు పై ధీమా వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇలా అటు జ్యోతి, ఇటు సాక్షిలోనూ కూడా నంద్యాల టెన్ష‌న్ క‌నిపిస్తోంది.

ఏదేమైనా ఒక్క‌టి మాత్రం నిజం. నంద్యాల‌లో వార్ ఉత్కంఠ‌గా ఉండ‌డంతో ఎక్క‌డ టీడీపీ ఓడిపోతుందోన‌ని జ్యోతికి భ‌యం ప‌ట్టుకుంటే, ఎక్క‌డ వైసీపీ ఓడిపోతుందోన‌ని సాక్షికి భ‌యం ప‌ట్టుకున్న‌ట్టే ఆ మీడియాల్లో వ‌స్తోన్న క‌థ‌నాలే చెపుతున్నాయి