విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇది ప్రచార ఆర్భాటమేనని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ లో బట్టబయలైంది. కొన్ని అంశాల్లో ముందు వరుసలోనూ, మరికొన్ని అంశాల్లో చివరిస్థానంలోనూ ఏపీ, తెలంగాణ ఉండటం గమనార్హం! పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని తేల్చింది. ఏపీ కూడా ఇదే బాటలో ఉందని వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై ఇటీవల పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్–2017ను విడుదల చేసింది.
10 నేపథ్యాలు, 26 కీలక విషయాలు, 82 సూచికల ఆధారంగా ఈ సంస్థ మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలవగా… తెలంగాణ 20వ స్థానంలో ఉంది. మరోవైపు ఏపీ కూడా పాలనాపరమైన అంశాల్లో వెనుకబడే ఉంది. ఇందులో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయా లతో కూడిన `ద్రవ్య నిర్వహణ`లో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది.
పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర అంశాలను పరిశీలించిన `ఆర్థిక స్వేచ్ఛ`లో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి. `అవసరమైన మౌలిక వసతులు` అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో; `మానవ అభివృద్ధికి చేయూత`లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం;
`సామాజిక భద్రత` అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో; `మహిళలు–పిల్లలు` అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాల్లో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి.
`న్యాయ సేవల పరిష్కారం`లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి. కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి. `పారదర్శకత, జవాబుదారీతనం` అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి. మరి దీనిని గమనించైనా రెండు రాష్ట్రాలు ర్యాంకులు మెరుగుపరుచుకుని అభివృద్ధి పథంలో పయనిస్తాయో లేదో!!