మంత్రి వర్గంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు తనయుడి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. మొన్నటివరకూ చినబాబు లోకేశ్ పార్టీలోకి రావాలని, తమతో పనిచేయాలని పార్టీ అధినేతను కోరిన సీనియర్లు.. తీరా వచ్చాక ఆయన వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారట. ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఇప్పటి నుంచే భావిస్తున్న లోకేశ్.. పబ్లిక్ మీటింగుల్లో తడబడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో సీఎం వెంటనే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియర్లతో ఎలా వ్యవహరించాలో కొడుక్కి క్లాస్ పీకినట్లు సమాచారం! రెండేళ్లలో ఎన్నికల నేపథ్యంలో కొంత స్ట్రాంగ్ గానే డోస్ ఇచ్చినట్లు తెలుస్తోంది!!
క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారట. ముఖ్యంగా నాయకులు బయట కానీ మీడియాతో కానీ మాట్లాడేటప్పుడు నోరు పారేసుకుని చులకన అయ్యే అవకాశాన్ని ఇస్తున్నారని దీన్ని ఆసరాగా చేసుకునే మీడియాలో ఒక వర్గం, సోషల్ మీడియా లో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నట్టు తెలిసింది. అంతేగాక ఇందులో తన తనయుడు, మంత్రి లోకేశ్ వ్యవహార శైలిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన వారసుడుకి ప్రత్యేకంగా క్లాసు పీకడం చర్చనీయాంశమైంది.
ఇటీవల పలు సందర్భాల్లో లోకేశ్.. మాటలు తడబడటం.. సోషల్ మీడియాలో ఇవి వైరల్ కావడం తెలిసిందే! అంబేద్కర్ జయంతి సభలో వర్ధంతి అనడం, స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు అయ్యింది అని వ్యాఖ్యానించడం, జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని కామెంట్ చేయటం ఒకటి రెండు కాదు మీడియా ముందు చినబాబు దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిపై చంద్రబాబు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారట. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. లోకేష్ కి పబ్లిక్ స్పీకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, లేకపోతే ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పినట్టు టాక్.
ఇక మంత్రివర్గంలో కొందరు సీనియర్లు కూడా లోకేష్ తీరుపై అసహనంగా ఉండటాన్ని కూడా బాబు హెచ్చరించారని తెలిసింది. తన మాటే చెల్లలి అనే రీతిలో సాగటం, భవిష్యత్తు పార్టీ అధ్యక్షుడిగా ఇప్ప్పుడే దర్పాన్ని ప్రదర్శించడం, సీనియర్ మంత్రులను గంటల తరబడి వెయిట్ చేసేలా చేయటం ఇవన్నీ మార్చుకోవాలని గట్టిగానే చెప్పారట. ఈ తీరు మార్చుకోక తప్పదని చంద్రబాబు చెప్పారని వార్త. మంత్రులతో కలివిడిగా ఉంటే వచ్చే ఉపయోగాలు వివరించి మరీ చెప్పినట్టు టాక్. మరి తన కోసం తండ్రి పడే ఆరాటాన్ని లోకేశ్ అర్థం చేసుకుంటారో లేదో!!