టీడీపీ-బీజేపీ క‌లిసి ఉంటే లాభం.. విడిపోతే న‌ష్టం

`క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి క‌రెక్ట్‌గా న‌ప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మ‌రింత సూట‌వుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎద‌గాలని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువగా జ‌ర‌గ‌వ‌చ్చ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల‌ ప‌రిపాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మోడీపై పొగ‌డ్త‌ల వ‌ర్షాన్ని కురిపించారు. ఏపీ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ఈ అంశాల‌ను కార్య‌క‌ర్త‌లు స‌మ‌ర్థంగా రాష్ట్ర ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే ఏపీలో కూడా బీజేపీకి ఆద‌రాభిమానాలు పెరుగుతాయ‌నీ, అంతా న‌డుంబిగించాల‌ని కోరారు.

ఏపీకి బీజేపీ ఎంతో చేస్తోంది. పోల‌వ‌రానికి వంద శాతం నిధులిస్తానంది. ఎన్నో ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను మంజూరు చేసింది. గుజ‌రాత్‌కు కేటాయించిన అణు విద్యుత్తు కేంద్రాన్ని ఎంతో ద‌య‌తో ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా కొవ్వాడ‌కు బ‌దిలీ చేసింది. అమ‌రావ‌తి నిర్మాణానికీ ఇతోధికంగా సాయ‌మందిస్తోందనీ పేర్కొంది. ఇవ‌న్నీ నిజ‌మే కావ‌చ్చు. బీజేపీ ఎంత చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్ముతారా? అనేద ప్ర‌శ్న‌! రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఈ పార్టీకి ఆ క్రెడిట్ ద‌క్కుతుందా. టీడీపీ ద‌క్క‌నిస్తుందా.

ఏపీ నుంచే రాజ్య‌స‌భ‌కు వెళ్లిన ఎంపీ రైల్వే మంత్ర‌యినా ఇంత‌వ‌ర‌కూ విశాఖ రైల్వే జోన్‌ను సాధించ‌లేదు. వ‌స్తుంది వ‌స్తుందంటూ చెప్పుకొస్తున్నారే గానీ, ఇంత‌వ‌ర‌కూ ఆ దిశ‌గా ఒక్క అడుగు ముందుకు పడ‌లేదు. ఈ చిన్న ప‌నినే ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని బీజేపీ, రాష్ట్రానికి అంత చేసిందీ ఇంత‌చేసిందీ అంటే న‌మ్మి ఓట్లేస్తారా అని విశ్లేష‌కుల అభిప్రాయం. ఒంటరిగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే ఉండ‌దు. కేంద్ర నాయ‌క‌త్వం ఇందుకు నిర్ణ‌యించినా రాష్ట్ర నాయ‌క‌త్వం దాన్ని తిర‌స్క‌రిస్తుంది. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖ‌మ‌న్న సూత్రాన్ని టీడీపీ, బీజేపీ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో పాటిస్తున్నాయి. ఇంతటి అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని బీజేపీ చెడ‌గొట్టుకునే ప‌నికి పాల్ప‌డ‌దు గాక పాల్ప‌డ‌దు.

హ‌రిబాబు పార్టీ రాష్ట్ర శాఖ‌కు అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర‌వాత‌, కొత్త అధ్య‌క్షుడిగా మ‌రొక‌రిని ఎన్నుకోలేక‌పోతోంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసి కూడా ఎందుకో వెన‌క‌డుగు వేసింది. ఆ త‌ర‌వాత దాని ఊసే లేదు. నూత‌న రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ-టీడీపీ బంధం విడ‌కూడ‌దు. కొన‌సాగాలి. ఈ బంధం విచ్ఛిన్న‌మైతే.. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తుకు అడ్డంకులెదుర‌వుతాయి. కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ప‌డితే ఎలా ఉంటుందో త‌మిళ‌నాడు ప‌రిణామాలు క‌ళ్ళ‌ముందు క‌నిపిస్తున్నాయి.