బీజేపీ నుంచి  సొంత‌గూటికి నాగం జంప్‌..!

బీజేపీ నేత‌, తెలంగాణలో సీనియ‌ర్ పొలిటీషియ‌న్ నాగం జ‌నార్ద‌న రెడ్డి.. పార్టీ మారుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ‌ల్లో నేత‌లు ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వాళ్లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నాగం కూడా త‌న రాజ‌కీయ కెరీర్‌, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

గ‌తంలో ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ నేత నాగం. ఆ త‌ర్వాత విప‌క్షంలోనూ దాదాపు ఐదేళ్ల‌కు పైగానే ఉన్నారు. అయితే, తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నేత కావ‌డంతో అప్ప‌ట్లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్య‌మం.. నాగంను ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో ఏదో ఒక‌స్టాండ్ తీసుకోవ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెనుకంజ వేయ‌డంతో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. తెలంగాణ న‌గ‌ర స‌మితి పేరుతో సొంత కుంప‌టి పెట్టుకున్నారు. అయితే, ఆ పార్టీ పెద్ద గా వ‌ర్క‌వుట్ కాలేదు.

దీంతో టీఆర్ ఎస్‌లో చేర‌డానికి అప్ప‌ట్లో తీవ్రంగా ప్ర‌య‌త్నించినా అది కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక‌, ఆ త‌ర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాను నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన‌ప్ప‌టికీ.. బీజేపీలో ఎలాంటి గుర్తింపూ ఉండ‌డం లేద‌ని త‌న అనుచ‌రుల వ‌ద్ద తెగఫీలై పోతున్న నాగం.. వాస్త‌వానికి బీజేపీలో ఏదో ఒక ప‌ద‌విని ఆశించారు. ప‌ద‌వి విష‌యం ప‌క్క‌న పెడితే.. అస‌లు ఈయ‌న‌ను క‌లుపుకొని వెళ్లే క‌మ‌ల నాథుడు ఒక్క‌ళ్లంటే ఒక్క‌ళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. దీనికితోడు అధికార టీఆర్ ఎస్‌తో బీజేపీ లోపాయికారీ ఒప్పందం ఏదో చేసుకున్న‌ట్టు నాగం అనుమానిస్తున్నారు.

దీంతో ఇక‌, నాగం త‌న పొలిటిక‌ల్ లైఫ్‌ను మ‌ళ్లీ టీడీపీతో జ‌త‌చేయాల‌ని భావించిన‌ట్టు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే ఆయ‌న శ‌నివారం టీ అసెంబ్లీలోని టీడీపీ ప‌క్ష కార్యాల‌యానికి స్వ‌యంగా వెళ్లి.. రేవంత్ రెడ్డితో భేటీ అయి చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట‌ను నాగం వెల్ల‌డించార‌ని స‌మాచారం. అయితే, పైకి మాత్రం ఈ విష‌యాన్ని దాచి పెట్టారు. తామంతా పాత ఫ్రెండ్స్ మ‌ని, అందుకే క‌లిసి మాట్లాడేందుకు మాత్ర‌మే వెళ్లాన‌ని నాగం చెప్పారు. కానీ, విష‌యం మాత్రం వేరే ఉంద‌నేది పొలిటిక‌ల్ విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.