నాన్న‌లా బావ‌ను కూడా ముంచుతావా హ‌రీ

ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు అంద‌రూ ఇలానే అంటున్నారట‌! నంద‌మూరి హ‌రికృష్ణ వ్య‌వ‌హార‌శైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేత‌ల‌తో స‌హా సానుభూతి ప‌రులు సైతం చ‌ర్చించుకుంటున్నారు. అంత స‌డెన్‌గా ఇప్పుడు హ‌రి గురించి చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది? అస‌లు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూర‌మై చాలా కాలం అయింది క‌దా! అని అనుకుంటున్నారా? నిజ‌మే! హ‌రికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూర‌మై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ట ఆయ‌న‌! దీంతో ఇప్పుడు హ‌రి గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. త‌న తండ్రి నంద‌మూరి ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించిన స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న‌గారు చైత‌న్య ర‌థంలో యాత్ర చేప‌ట్టారు. ఆ చైత‌న్య ర‌థానికి డ్రైవ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన హ‌రికృష్ణ‌.. ఆ త‌ర్వాత అదే తండ్రికి నెత్తిన కుంప‌టిగా త‌యార‌య్యాడ‌ని అనుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బావ‌గారైన చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి.. ల‌క్ష్మీపార్వ‌తికి వ్య‌తిరేకంగా ఎన్‌టీఆర్‌ను గ‌ద్దెనుంచి దించేయ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషించారు. అంటే.. సొంత తండ్రి అధికారాన్నే లాగేసుకోవ‌డంలో ముఖ్య వ్యక్తిగా మారార‌న్న‌మాట‌. అంతేకాదే, ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో అన్న‌గారు స‌డెన్‌గా ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప‌రోక్షంగా హ‌రే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ వినిపిస్తాయి.

ఇక‌, ఆ త‌ర్వాత ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ర‌వాణా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినా.. సంతృప్తి చెంద‌లేదు. దీంతో అన్న తెలుగు దేశం పార్టీని స్థాపించారు. దీనిని పెద్ద ఎత్తున బావ గారికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. అయితే, అది అట్ల‌ర్ ప్లాప్ అయింది. దీంతో మ‌ళ్లీ మౌనం. దీంతో మ‌రోసారి చంద్ర‌బాబే ద‌గ్గ‌ర‌కు తీసుకుని రాజ్య‌స‌భ సీటిప్పించ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత త‌లెత్తిన విభ‌జ‌న ఉద్యమం నేప‌థ్యంలో స‌మైక్య గ‌ళాన్ని వినిపించిన హ‌రి.. పౌరుషానికి పోయి.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌ళ్లీ ఖాళీ! ఇదిలావుంటే, ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. ఆయ‌న‌ను పొలిటిక‌ల్‌గా ప‌త‌నం చేయించ‌డంతోపాటు.. త‌న కుమారుల భ‌విష్య‌త్తును కూడా నాశ‌నం చేస్తోంద‌నే టాక్ ఉంది.

ఇక‌, ఇప్పుడు తాజాగా… హ‌రికృష్ణ.. బావ చంద్ర‌బాబుపై ఎగ‌స్పార్టీ క‌ట్టార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో రానున్న ఎన్నిక‌ల్లో బాబుని, ఆయ‌న టీంని చిత్తుగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ట‌. దీనికి కార‌ణాలు చిన్న‌వో పెద్ద‌వో ఆయ‌న‌కే తెలియాలి. ఈ క్ర‌మంలో జగ‌న్ అండ్ కో పంచ‌న చేరేందుకు హ‌రి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇది వ‌ర్క‌వుట్ అయితే, జ‌గ‌న్‌తో క‌లిసి.. బాబుపై దండ‌యాత్ర చేసి రికార్డు సృష్టించాల‌ని హ‌రి ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఓడించ‌డం వ‌ర‌కు బాగానే అనిపిస్తున్నా.. ఆ త‌ర్వాత హ‌రికి.. జ‌గ‌న్ అంత సీన్ ఇస్తాడా? అనేది ప్ర‌శ్న‌. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిగురించి తెలిసిన వారు ఎవ‌రైనా ఇదే అంటున్నారు. జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేసే టైప్ క‌దా.. మ‌రి హ‌రిని కూడా వాడుకుని వ‌దిలేస్తే.. ఏంటి ప‌రిస్థితి అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం ప‌క్క‌న‌పెట్టి.. ఇప్ప‌టికిప్పుడున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. నాన్న‌లా బావ‌ను కూడా ముంచుతావా హ‌రీ!! అనే కామెంట్లే వినిపిస్తున్నాయి.