టీడీపీ డ‌బుల్ గేమ్‌

ఏపీ అధికార పార్టీ టీడీపీ మ‌రోసారి డ‌బుల్ గేమ్ పాల‌సీని బ‌య‌ట పెట్టుకుంది. అంటే ఒకే స‌మ‌స్య‌పై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణ‌లో విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయ‌డంలో టీడీపీ నేత‌లు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో విప‌క్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేల‌ను పిలిచి మ‌రీ సైకిల్ ఎక్కించుకోవ‌డాన్ని బాహాటంగా స‌మ‌ర్ధించుకున్న టీడీపీ ఏపీ త‌మ్ముళ్లు.. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల‌కు అక్క‌డి అధికార పార్టీ టీఆర్ ఎస్ వ‌ల విస‌ర‌డాన్ని తీవ్రంగా ఖండించి గుండెలు బాదుకున్నారు.

ఇప్పుడు కూడా ఇలాంటి సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే, అది కేంద్ర పాల‌సీపైనే! గ‌త నెల 8న పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ .. పీఎం మోడీ ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న ముగిసిన అర‌గంట‌లోనే మీడియా మైకందుకున్న చంద్ర‌బాబు.. ఆ నిర్ణ‌యం త‌న‌దేన‌ని, పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల‌ని తానే లేఖరాశాన‌ని చెప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత వారానికి ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. దీంతో ప్లేట్ ఫిరాయించిన బాబు.. న‌గ‌దు ర‌హితానికి అంద‌రూ అల‌వాటు ప‌డాల‌ని, అదేమీ బ్ర‌హ్మ విద్య కాద‌ని పిలుపునిచ్చారు. అనుకూల మీడియాలో న‌గ‌దు ర‌హిత దేశాలు, ఎలా మారాలి వంటి ప‌లు విష‌యాల‌పై ప్ర‌చారం దంచి కొట్టేలా పిలుపుకూడా ఇచ్చారు.

ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఇక్కడ విప‌క్షంలో ఉన్న టీడీపీ.. పెద్ద నోట్ల ర‌ద్దుపై యాగీ చేస్తోంది. నోట్ల ర‌ద్దును తాము వ్య‌తిరేకించ‌డం లేద‌ని, ఆ త‌ర్వాత ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌నే ప్ర‌శ్నిస్తున్నామ‌ని టీ త‌మ్ముళ్లు చెబుతున్నారు. అసెంబ్లీ వేదిక‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ఏక‌రువు పెట్టారు. బ్యాంకుల వ‌ద్ద లైన్ల‌లో నిల‌బ‌డి ప్రాణాలు కోల్పోయిన వారి వివ‌రాల‌ను పేరుపేరునా వివ‌రించారు. ప్ర‌భుత్వం త‌గిన విధంగా స్పందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ ఉంది. అయినా.. అక్క‌డి తెలుగుదేశం నేత‌లు ప‌ట్టించుకోకోపోవ‌డాన్నే.. టీడీపీ డ‌బుల్‌గేమ్‌.. అనుకోవాలేమో!!