ఇంట్లో దెయ్యం నాకేం భయం TJ రివ్యూ

సినిమా : ఇంట్లో దెయ్యం.. నాకేం భయం
రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : దెయ్యముంది కానీ బయ్యమే లేదు..రాదు..

నటీనటులు : అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి
సంగీతం : సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు : డైమండ్ రత్నబాబు
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి.

టైం బ్యాడ్ అక్కా,టైం బ్యాడ్ అయితే ఏది వర్క్ అవుట్ అవదక్కా… టైం బ్యాడ్ అయితే అంటిపండు తిన్నా పన్ను ఇరుగుద్ది లాంటి సినిమా డైలాగ్స్ ప్రస్తుతం అల్లరి నరేష్ కి అతికినట్టు సరిపోయేలా వున్నాయి.సరైన హిట్ కోసం భేతాళ ప్రయత్నం చేస్తున్న నరేష్ కామెడీ జోనర్స్ అయితే జనాలు విసిగిపోయారు, ట్రెండ్ కి తగ్గట్టు హర్రర్ కామెడీ చేసయినా సరే హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసినా ఇది కూడా వికటించింది.

మనలో మాట.. అవి హిట్ అవుతున్నాయి..ఇవి హిట్ అవుతున్నాయి అని ఆ స్క్రిప్ట్స్ ని కాపీ కొడితే హిట్స్ వస్తాయా…ఏదయినా కొత్తగా ట్రై చేస్తుంటే ఇవ్వాల కాకపోయినా రేపయినా హిట్ వస్తుంది..ఈ విషయం పాపం అల్లరోడికి ఎప్పుడు బోధ పడుతుందో ఏమో.అయినా హర్రర్ కామెడీ కి కాలం చెల్లి ఎన్నాళ్ళయింది ఈయన గారు ఇప్పుడొచ్చి ఆ సబ్జెక్టు ని నెత్తినేసుకుని హిట్ అవ్వమంటే అవుతుందా..కొంచెం అయినా అప్డేట్ అవ్వకపోతే ఎలా..

బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత,శివ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం అల్లరి నరేష్ నుండి సినిమా..ఈ కాంబినేషన్ కాస్త ఆసక్తిని రేకెత్తించిన మాట వాస్తవం..అది చల్లారడానికి ఎక్కువ టైం పట్టదనుకోండి అది వేరే విషయం.సినిమాకు అన్ని హంగులూ వున్నా ఐదో తనం లేదన్నట్టు..కథలో పస లేకుండా ఎన్ని ఆర్భాటాలుంటే మాత్రం ఏమి లాభం.

ఓ అందమైన కోట లాంటి అమ్మకానికున్న ఇల్లు..అందులో ఓ దెయ్యం..ఇంకో వైపు బ్యాండు మేళం బ్యాచ్ వుండే హీరో..అతని ప్రేమ..డ్యూయెట్స్..ఇంతలో అనుకోని పరిస్థితుల్లో హీరో ఆ భవంతి లో ఎంట్రీ ..దయ్యం తో పరిచయ కార్య క్రమాలు..ఇంటర్వెల్..ఫ్లాష్ బ్యాక్..మళ్ళీ కామెడీ ట్రాక్ లు..దెయ్యం రివేంజ్ లు..క్లైమాక్స్..దెయ్యం ఎవరు దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది రెవీల్ అయ్యాక సినిమా అటు కామెడీ కి ఇటు హర్రర్ కి చెడ్డ రేవడిలా తయారయ్యి ఖేల్ ఖతం..దుకాణ్ బంద్.ఇది టూకీగా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం.

ఈ మొత్తం కథలో టార్చ్ లైట్ వేసి వెతికినా మనకు మచ్చుకైనా ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు..అన్నీ ఎక్కడో వాడి వదిలేసిన అరిగిపోయిన సీన్ లను గుర్తుతెస్తుంటాయి.కొత్తదనం ఏంటా అంటే ఇప్పటివరకు దెయ్యం సినిమాల్లో దెయ్యాలు ఎవరో ఒకర్ని ఆవహిస్తూ ఉంటాయి బట్ ఫర్ ఆ చేంజ్ ఇందులో మాత్రం పాపం హీరోయిన్..హీరో,రాజేంద్రప్రసాద్ ఇలా ఒకరా ఇద్దరా ఎవర్ని పడితే వాళ్ళని వాడేసుకుంటుంది దెయ్యం.ఒకరికే దెయ్యం పెట్టె సీన్స్ ఉంటే ఇంకోరు ఫీల్ అవుతారనుకున్నారో ఏమో పాపం చాల బ్యాలన్సుడ్ గా అందరికీ దెయ్యం పట్టించారు.

అల్లరి నరేష్ కెరీర్ వెంటిలేటర్ పై ఉందనిపిస్తోంది.తొందరగా మేల్కొని జాగ్రత్త పడకపోతే ఈ గజినీ దండయాత్రలు చేయడానికి నిర్మాతలు కూడా వుండరు.సినిమాలో నరేష్ నటన కంటే గ్లామర్ కె మర్క్స్ ఎక్కువ ఇవ్వొచ్చు..హీరోయిన్స్ పర్లేదు..ఎవరికి తోచిన..చేతనయిన మేర అందాలు ఆరబోశారు.రాజేంద్రప్రసాద్ భయం మనకు తెలియంది కాదు.సర్ప్రైస్ ఎంట్రీ అంటే బ్రహ్మానందం ది.చాలా రోజుల తరువాత బ్రహ్మం ఎంట్రీ కాస్త రిలీఫ్ అనిపిస్తుంది.అయిపోవటానికి నేనేమయినా ఐస్ క్రీం అనుకున్నార్రా…ఐఫోన్ లాంటోడ్ని లాంటి ఎంట్రీ డైలాగ్స్ బాగున్నాయి..ఓవర్ అల్ గా బ్రహ్మానందం పాత్ర ఓకే.మిగిలిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్స్ షకలక శంకర్..చమ్మక్ చంద్రలు హీరో స్నేహితులుగా ఫుల్ లెంగ్త్ రోల్స్ లో పర్లేదనిపించారు..మిగిలిన వాళ్ళందరూ తమ తమ పరిధి మేర నటించారు.

సాంకేతికంగా సినిమా అత్యున్నత విలువలతో నిర్మించారు..ఆ కృషి స్క్రీన్ పై కనిపిస్తుంది..పాటలు బాగున్నాయి..ఆన్ స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి..క్రెడిట్ కొరియోగ్రాఫేర్స్ మరియు కెమెరామెన్ కి దక్కాలి.సినిమాకి అతి పెద్ద వీక్ నెస్ స్క్రీన్ ప్లే.. అంత వీక్ గా పేలవవంగా అసలేమాత్రం గ్రిప్పింగ్ గా సాగదు.కథలో డొల్ల తనాన్ని ఎంతో కొంత స్క్రీన్ ప్లే తో కవర్ చేయొచ్చు కానీ ఈ సినిమాలో రెండూ డొల్లే. ఎడిటింగ్ పర్లేదు.మాటలు సినిమాకి పెద్ద అసెట్..చిన్న చిన్న కామెడీ పంచ్ లు బాగున్నాయి..చేపమందు ని చేప మందు అనడం..ఆవాహనం ఏ వాహనం అది అనడం లాంటివి చాలానే వున్నాయి.

మొత్తానికి హర్రర్ కామెడీ సినిమాల్లో దెయ్యాలకు ఓ పర్పస్ అంటూ ఉంటుంది ఆ పర్పస్ అవ్వగానే ప్యాక్ అప్ చెప్తాయి..ఈ ఇంట్లో దెయ్యం మాత్రం పర్పస్ అయ్యాక కూడా క్లారిటీ లేక కొట్టు మిట్టాడుతుంది పాపం.మొత్తానికి ఇంట్లో దెయ్యం అటు అటుభయానికి దూరం గా కామెడీ కి కాస్త దగ్గరగా నిలుస్తుంది.