టీ కాంగ్రెస్‌లో సొమ్మున్న నేత‌ల పోస్టు వాంటెడ్‌..!

అవును! మీరు చ‌దివింది నిజ‌మే!! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టుల‌కు అంతే కీల‌క‌మైన అభ్య‌ర్థుల కోసం పార్టీ ఎదురు చూస్తోంద‌ట‌! ప్ర‌స్తుతం ఉన్న నేత‌లంతా ఉత్తుత్తి బ్యాంకు మాదిరిగా ఉత్తుత్తి బ్యాచ్‌లా త‌యార‌య్యార‌ని కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్టులు వెళ్లిన‌ట్టు స‌మాచారం .ఈ క్రమంలో మంచి ద‌మ్ము, సొమ్ము ఉన్న నేత‌లు రంగంలోకి దిగితేకానీ, 2019లో అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్ప‌డం కుద‌ర‌ద‌ని ఓ డెసిష‌న్‌కి వ‌చ్చింద‌ట అధిష్టానం. ఈ క్ర‌మంలోనే సొమ్మున్న నేత‌ల పోస్టు కోసం నేత‌లను వెతుకుతున్నట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం!
ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉంద‌ట! ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు అధికార పార్టీ కారెక్కేయ‌గా.. ఉన్న కొద్ది మందిలోనూ ఒక‌రిద్దరు త‌ప్ప మిగ‌తావారు అంత‌బ‌లంగా కాంగ్రెస్ వాణిని వినిపించ‌లేక‌పోతున్నార‌ట‌. ముఖ్యంగా పార్టీని న‌డిపించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. మాట‌కు పెద్ద‌గా విలువ ఉండ‌డంలేద‌ని, ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు నేత‌లు పెద్ద‌గా హాజ‌రుకావ‌డం లేద‌ని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయ‌ట‌. ఇక‌, సీనియ‌ర్ నేత‌లు జానా రెడ్డి, వీ హ‌నుమంత‌రావులు తెలంగాణ కాంగ్రెస్‌కి ఎంతో అందివ‌స్తార‌ని, పార్టీకి బ‌లంగా మార‌తార‌ని భావించింది.
అయితే.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. జానా అధికార పార్టీని మెచ్చుకుంటూ.. అస‌లు జానా విప‌క్షంలో ఉన్న అధికార స‌భ్యుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో వీహెచ్ కూడా ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌ని నేత‌. మిగిలిన నేత‌ల్లో మాజీ మంత్రి డీకే అరుణ ఇటీవ‌ల వ‌ర‌కు కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధించారు. అయితే, గ‌ద్వాల్ జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డంతో ఆమె సైలెంట్ అయిపోయారు. అంతేకాదు, అస‌లు ఆమె ఎప్పుడు టీఆర్ ఎస్ కారెక్కుతారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. మిగిలిన‌వారిలో మాజీ మంత్రి గీతారెడ్డి అంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయ‌లేక‌పోతున్నారు.
టీ కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా ఉన్న నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. అవ‌స‌ర‌మైతే.. అన్నివిధాలా ద‌మ్ము… సొమ్ముతో.. ఓట్లు రాబ‌ట్టే నేత అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ భావిస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి వాళ్ల‌కోసం ఎదురు చూస్తోంద‌ట‌. ఈనేప‌థ్యంలోనే న‌ల్ల‌గొండ‌కు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.. త‌మ ద‌గ్గ‌ర అన్నీ ఉన్నాయ‌ని, అస‌లు అధిష్టానం కోరుకుంటున్న ల‌క్ష‌ణాలకు తాము ఎంత‌మాత్ర‌మూ తీసిపోమ‌ని పేర్కొంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే వారు ఆ ఖాళీ పోస్ట్ కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో వేచి చూడాలి!!