టీడీపీలో ఒక్క‌టైన బ‌ద్ధ శ‌త్రువులు

క‌డ‌ప జిల్లాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లుగా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గాన్నిచెప్పుకోవాలి. ఇక్క‌డ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఇటీవ‌ల టీడీపీ తీర్థం పుచ్చుకున్న‌..ఆదినారాయణరెడ్డి,  మొద‌టినుంచి టీడీపీనే న‌మ్ముకున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల వైర‌ముంది. అందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీ లోకి రావ‌డాన్ని… రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకించింది.

చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్య‌మో… లేక ఈ  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు వ్యూహ చ‌తుర‌తో తెలియ‌దుగానీ విప‌క్ష అధినేత జగ‌న్ సొంత‌ జిల్లాలో ప‌రిణామాలు ప్ర‌స్తుతం…శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఈ నేత‌లు ఇద్ద‌రూ ఒకేపార్టీ గూటిక చేరినా ఎన్న‌టికీ కలవరన్న ప్రతిపక్ష నేత జగన్ కలల‌ను క‌ల్ల‌లు చేస్తూ  బ‌ద్ద‌శ‌త్రువులైన రామ‌సుబ్బారెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇటీవ‌ల మంత్రి గంటా స‌మ‌క్షంలో ఎంపీ సీఎం ర‌మేష్‌ల స‌మ‌క్షంలో ఒకే వేదికపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం తాము క‌లిసిప‌నిచేస్తామ‌న్న సూచ‌న‌లిచ్చారు. ఓ ర‌కంగా  వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఇది శ‌రాఘాత‌మేన‌ని చెప్పాలి.

క‌డ‌ప జిల్లా ఎర్రగుంట్లలో జనచైతన్యయాత్రల సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇన్‌చార్జిమంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు… అన్ని వ‌ర్గాల సంక్షేమానికి కృషి చేశార‌ని ఆయ‌న‌ను ప్రతి కార్యకర్త స్మరించుకోవాల్సిన అవసరం ఉందని  చెప్పారు.  ఇక జిల్లాలో దశాబ్దాలుగా ప్ర‌త్య‌ర్థులుగా కొన‌సాగిన  ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి రావ‌డం పార్టీకి మ‌రింత శుభ‌ప‌రిణామమ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో జమ్మలమడుగు నుంచే టీడీపీ అత్యధిక మెజార్టీ వస్తుందని గంటా వ్యాఖ్యానించా. వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి మొదటి వికెట్‌గా బోణీ చేశార‌ని, ఆ వెంట‌నే మ‌రో 20 వికెట్లు పడ్డాయని మంత్రి గంటా గుర్తు చేశారు. టీడీపీకి జమ్మలమడుగు మళ్లీ కంచుకోటగా మార‌నుంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇదేవేదిక పైనుంచి ఎంపీ సీఎం ర‌మేష్ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు. రాబోయే శీతాకాల సమావేశాల తరువాత త‌న పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్‌చెప్పారని, అప్పటి ద‌కా అవ‌స‌రం ఏముంద‌ని.. ఇప్పుడే రాజీనామా చేయిస్తే కడప నుంచే బుద్ధి చెబుతామని  సీఎం రమేష్ జ‌గ‌న్ కు స‌వాల్ విసిరారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. క‌డ‌ప జిల్లాలో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని కూడా ఆయ‌న ఛాలెంజ్ విసిరారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో తాము, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒక్కటయ్యామని, ఇక నియోజవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని.. బ‌హిరంగ‌వేదిక‌పైనే ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. జగన్‌ పద్ధతులు ఏమాత్రం నచ్చకపోవడం, టీడీపీ నుంచి ఆహ్వానం అందడంతో నే తాను టీడీపీలో చేరానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  చంద్ర‌బాబు  ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నియోజ‌క‌వ‌ర్గంలో  7 వేల పింఛన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. పులివెందుల కంటే జమ్మలమడుగులో పింఛన్లు ఎక్కువ ఇప్పిస్తున్నామన్నారు.

మొత్తంమీద ఇప్ప‌టిదాకా జ‌గ‌న్‌కు కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చిన ఆయ‌న సొంత జిల్లాలో తాజాగా చోటుచేసుకుంటున్న‌ ప‌రిణామాలు, మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు.. వైసీపీ కోట‌లు బీట‌లు వారుతున్న‌ట్టు చెప్ప‌క‌నే చెపుతున్నాయ‌ని రాజ‌కీయవ‌ర్గాలువిశ్లేషిస్తున్నాయి.