జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి..!

ఏపీలో త్వ‌ర‌లోనే రానున్న జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. తిరుప‌తి – కాకినాడ‌- విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు మొత్తం 11 చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అదేస‌మ‌యంలో విప‌క్ష వైకాపా కూడా అమీతుమీ తేల్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాలను చ‌ర్చించుకుంటే.. ఏపీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ.. ఇప్పుడు మంచి రేంజ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌నాలు త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. నేరుగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కే వెళ్తుండ‌డం కొన్నాళ్లుగా క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో రానున్న స్థానిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన పోటీకి దిగుతుందా?  లేదా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. జ‌న‌సేన పోటీకి దిగితే.. ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థాగ‌తంగా ఎక్క‌డా ప‌వ‌న్ పార్టీ పుంజుకోలేదు. పార్టీకి పూర్తిస్థాయి కేడ‌ర్ లేదు. ప‌వ‌న్ ఏదైనా పిలుపు ఇస్తే.. దానిని నెర‌వేర్చేందుకు, పార్టీ జెండాను భుజానికి ఎత్తుకునేందుకు కూడా పూర్తిస్థాయిలో కేడ‌ర్ ఇంకా సిద్ధం కాలేదు. ఈ నేప‌థ్యంలో రెండు మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న స్థానిక పోరుకు జ‌న‌సేన సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అయితే, జ‌న‌సేనను అభిమానించే వారు ఏ పార్టీకి ఓట్లు వేయాల‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.  వాస్త‌వానికి ప‌వ‌న్ 2014లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు ప‌వ‌న్ చెప్పిన వారికే ఓట్లు వేశారు. ఫ‌లితంగా టీడీపీ అధినేత ఏపీలో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు కూడా ప‌వ‌న్ అదేవిధంగా పిలుపునిస్తారా? అనే ది ప్ర‌శ్న‌గా మారింది. తాను ఎలాగూ పోటీ చేయ‌డం లేదుకాబ‌ట్టి తాను మ‌ద్ద‌తిచ్చే పార్టీని, వారి అభ్యర్థుల‌ను గెలిపించాల‌ని ప‌వ‌న్ పిలుపునిస్తారా? అనేది చూడాలి. ఇదే క‌నుక జ‌రిగితే.. జ‌న‌సేన ఓట్లు టీడీపీ కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.