చంద్ర‌బాబు – కేసీఆర్ ఫీట్లు చూశారా..!

ఇప్ప‌టికే ఒక ప‌క్క ప్ర‌భుత్వ పాల‌న‌, మ‌రోప‌క్క పార్టీ కార్య‌క‌లాపాల వ్యూహ ర‌చ‌న‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు స‌రికొత్త ఫీట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బ‌లంగా ఉన్న ప్ర‌ధాన విప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే క్ర‌మంలో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు ఇద్ద‌రు చంద్రులు. ఆప‌ర్ ఆక‌ర్ష్‌కి తెర‌తీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. టీడీపీ, కాంగ్రెస్‌, వైకాపా ఆఖ‌రికి క‌మ్యూనిస్టులను సైతం త‌న కారెక్కించుకున్నారు. దీనికి ఒక‌టి రెండు నెల‌లు ఆల‌స్యంగా ప్రారంభించిన ఆక‌ర్ష్‌తో చంద్ర‌బాబు వైకాపా నుంచి 18 మంది హేమా హేమీల వంటి వైకాపా ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఫిరాయింపుల‌తో పార్టీ గోడ‌లు దూకిన ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌కు ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు ఇద్ద‌రు సీఎంలు. ఈ క్ర‌మంలో ఏపీలో మంత్రి ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం జ‌ర‌గాల్సి ఉంది. తెలంగాణ‌లోనూ ప‌రిస్థితి అంతే! ఇక‌, ఈ విష‌యం  ఇద్ద‌రు సీఎంల‌కు పెద్ద ఇబ్బంది కాక‌పోవ‌చ్చు. కానీ, అస‌లు ప‌రీక్ష 2019లోనే. ఎందుకంటే.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఇరువురు సీఎం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఘ‌న విజ‌యం సాధించి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు స‌హా కొత్త‌గా పార్టీలుమారి వ‌చ్చిన వారిని కూడా సంతృప్తి ప‌ర‌చాల్సి ఉంది. లేక‌పోతే అసంతృప్తులు కొంప‌ముంచే ప్ర‌మాదం పొంచి ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు చంద్రులు.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై దృష్టి పెట్టారు. అయితే, ఇది వీరి చేతిలో ప‌నికాదు కాబ‌ట్టి కేంద్రంతో ఇప్ప‌టికే దీనిపై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లోనూ ఇదే విధ‌మైన క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల‌ను పెంచ‌డం త‌థ్య‌మ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇటీవ‌ల కేంద్రానికి ఈ మేర‌కు వ‌ర్త‌మానం కూడా పంపారు.

మ‌రోప‌క్క‌, కేంద్రం కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీట్ల‌ను పెంచేందుకు రెడీగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. పైకి మాత్రం మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయ‌ని చెబుతున్నా.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం ఉన్న మోడీ ప్రభుత్వానికి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ త‌మ‌కు అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల‌ను పెంచ‌డం ద్వారా ఇరు వురు సీఎంల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలోని 175, తెలంగాణ‌లో 119 అసెంబ్లీ సీట్లు భారీ ఎత్తున పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.  ఈ క్ర‌మంలో మ‌రింత‌గా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇటు చంద్ర‌బాబు నిన్న త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశార‌ట‌. అలాగే, కేసీఆర్ ఇప్ప‌టికే ఓ లేఖ రాసిన‌ట్టు స‌మాచారం.