కేసీఆర్ కేబినెట్‌లో ఈ ముగ్గురు మంత్రులు అవుట్‌..!

తెలంగాణ రాష్ట్ర ప‌రిపాల‌న వ‌న్ మ్య‌న్ షోగా మారిపోయింద‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌ల మాటెలా ఉన్నా.. కేసీఆర్‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. ఈ స‌ర్వేల విశ్వ‌స‌నీయ‌త‌నూ ప్ర‌తిప‌క్ష‌లు శంకించండం ప‌క్క‌న‌బెడితే… కేసీఆర్‌తో త‌ల‌ప‌డ‌గ‌ల మొన‌గాడెవ‌డూ ప్ర‌స్తుతం తెలంగాణ రాజకీయ‌వేదిక మీద క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌డం లేద‌న్న‌ది మాత్రం నిర్వివాదాంశం.

ఇదిలా ఉండ‌గా త‌మ త‌మ శాఖ‌ల్లో  పాల‌నాప‌రంగా మంచి మార్కులు తెచ్చుకోని మంత్రులకు త‌న క్యాబినెట్‌నుంచి ఉద్వాస‌న ప‌లికేందుకు కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రివ‌ర్గం నుంచి ప్ర‌స్తుతానికి  ఓ ముగ్గురు నేత‌లకు మంత్రి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయం అని చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేర్పుల‌కు కేసీఆర్ తెర‌తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న, నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ నుంచి పద్మారావులను మంత్రులుగా తొల‌గించి  వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.  అలాగే కొత్త గా ఏర్ప‌డిన జిల్లాలు క‌లుపుకుని జిల్లా అధ్య‌క్షుల ఎంపిక‌, నామినేటెడ్ పోస్టుల‌ను అర్హులు, పార్టీ విధేయులకు కేటాయించాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో టీఆర్ ఎస్‌ పార్టీ ఆశావ‌హుల్లో మ‌ళ్లీ ప‌ద‌వుల ఆరాటం మొద‌లైంది.