అప్పుడే జ‌న‌సేన మూట ముల్లు స‌ర్దేసిందా..!

సినీ న‌టుడిగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే… మ‌రోప‌క్క పూర్తిస్థాయి రాజ‌కీయ‌వేత్త‌గానూ అవ‌తార‌మెత్తేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పశ్చిమ‌గోదావ‌రిని త‌న రాజ‌కీయాల‌కు కేంద్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది.

ఏలూరుకు త‌ర‌లి రావాల‌న్న‌ ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంతో రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌ను , సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌స్తుతం తెలుగు సినీ అగ్ర‌న‌టుల్లో ఒక‌రిగా ఉన్నారు. అంతేకాదు… ఆయ‌న‌కు తెలంగాణ‌లోనూ విశేష సంఖ్య‌లో అభిమానులు ఉన్న సంగ‌తి ఇక్క‌డ గుర్తుంచుకోవాలి. గ‌తంలో ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌ర కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనే త‌న పార్టీని పోటీకి నిలుపుతార‌ని, అక్క‌డ గెల‌వ‌డం ద్వారా త‌న స‌త్తా ఏంటో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చాటాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చినా ఎందుక‌నో ఆయ‌న బ‌ల్దియా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే సాహ‌సం చేయ‌లేదు.

మ‌రిప్పుడు పవన్ త‌న‌ పార్టీ కార్యాలయాన్నికూడా ఆంధ్రా ప్రాంతానికి మార్చాలనుకోవ‌డాన్నిబ‌ట్టి ఇక ఆయ‌న తెలంగాణ రాజ‌కీయాల‌కు పూర్తిగా తిలోద‌కాలిచ్చిన‌ట్టేనా…? ఇక ఏపీ రాజ‌కీయాల‌కు మాత్ర‌మే జ‌న‌సేన ప‌రిమితం కావాల‌నుకుంటోందా..? అంటే.. నిజ‌మేన‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప‌వ‌న్ త‌న‌కు ఏపీలోనే రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు ఉండ‌గ‌ల‌ద‌ని న‌మ్ముతున్నార‌ట‌.

తెలంగాణ తో పోలిస్తే ఆంధ్రా ప్రాంతంలోనే పార్టీకి ఎక్కువ ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని సమాలోచనలు చేసిన పవన్ తన కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి సిద్ధ పడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాకుండా ఇప్ప‌టికీ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కేంద్రంగా కొన‌సాగుతుండ‌టం, స‌మీప భ‌విష్య‌త్తులోనూ అక్క‌డినుంచి త‌ర‌లివ‌చ్చే లేక‌పోవ‌డం నేప‌థ్యంలో.. తెలంగాణ రాజ‌కీయాల‌నుంచి దూరంగా ఉంటేనే త‌న సినీ ప్ర‌స్థానానికీ మేల‌న్న‌నిర్ణ‌యానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌చ్చిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.