బాబుపై లోకేష్ అల‌క‌కు రీజ‌న్ ఇదేనా

వార‌స‌త్వ రాజ‌కీయాలు దేశ, రాష్ట్ర రాజకీయ ముఖ‌చిత్రంలో మ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే విలువ‌లకు క‌ట్టుబ‌డిన అతి కొద్దిమంది రాజ‌కీయ నేత‌లు మాత్రం.. ఇలాంటి రాజ‌కీయాల‌ను త‌మ ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేద‌న్న‌ది ఈ సంద‌ర్భంగా త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. ఈ విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు పేరును ముందుగా చెప్పుకోవాలి. ఆయ‌న త‌న కొడుకుల్లో ఏ ఒక్క‌రికీ పాల‌నా వ్య‌వ‌హారాల్లో ఇసుమంతైనా జోక్యం క‌ల్పించుకునే అవ‌కాశం ఎన్న‌డూ ఇవ్వ‌లేదు. ఒక‌ర‌కంగా ఆయ‌న కుమారులు కూడా అందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెప్పాలి.  నిజానికి ప్రాంతీయ పార్టీ అధినేత‌గా రాష్ట్ర  రాజ‌కీయాల్లో.. ఎన్టీఆర్ ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యం వ‌హిస్తున్న‌కాలంలో ఆయ‌న కుమారుల కార‌ణంగా ఏ రక‌మైనా వివాదాలు త‌లెత్త‌లేదంటే.. అందుకు ఎన్టీఆర్‌తో పాటుగా ఆయ‌న కుమారుల‌ను కూడా త‌ప్ప‌క అభినందించాల్సిందే.

ఇక వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌కొస్తే వ్య‌క్తి పూజ త‌గ్గ‌డానికి మారుగా రాను రాను తారాస్థాయినందుకుంటున్న‌ద‌నే చెప్పాలి. పొరుగున ఉన్న త‌మిళ‌నాడులో ఎమ్జీఆర్ రాజ‌కీయ వార‌సురాలిగా జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి వార‌సుడిగా స్టాలిన్‌, మార‌న్ కుటుంబీకులు చ‌క్రం తిప్పుతుండ‌గా… కొత్త రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో ఏకంగా కేసీఆర్ కుటుంబ పెత్త‌న‌మే ఏక‌ప‌క్షంగా సాగుతోంది. ఉత్త‌రాదినా ఇందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణ‌మేమీలేదు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి  వైఎస్ హ‌యాంలో ఆయ‌న కొడుకు జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా ప‌రోక్షంగా క‌లుగ‌జేసుకున్న తీరుపై, తండ్రి అధికారాన్నిఅడ్డం పెట్టుకుని వ్యాపారాల్లో వేల కోట్ల రూపాయ‌లు సంపాదించారంటూ విప‌క్షాలు పెద్ద పోరాట‌మే న‌డిపాయి. అయితే వైఎస్ విప‌క్షాల ప్ర‌చారాన్ని, విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం లెక్క చేయ‌కుండా కొడుకును ఏకంగా ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు.

జ‌గ‌న్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకొచ్చిన కొద్దిరోజుల‌కే వైఎస్ దుర్మ‌ర‌ణం పాల‌వ‌డంతో… ఆ సానుభూతి జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన సానుభూతిని తెచ్చిపెట్టింది. వైఎస్‌కు సిస‌లైన వార‌సుడిగా జ‌గ‌న్‌ను ఒక వ‌ర్గం ఆద‌రించ‌డంతో ఒక‌ర‌కంగా ఏపీలో వార‌సత్వ రాజ‌కీయాలు మ‌రోద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు కూడా.. వీటిని పూర్తిస్థాయిలో ఆమోదించిన‌ట్టుగానే క‌నిపిస్తోంది.  ఒక‌రకంగా ఇది టీడీపీ అధినేత, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇర‌కాటాన్ని క‌లిగించే ప‌రిస్థితేన‌ని చెప్పాలి. ఇందిరాగాంది, చెన్నారెడ్డి, కోట్ల విజ‌యభాస్క‌ర‌రెడ్డి వంటి ఉద్ధండుల‌తో పాటు, రాజ‌కీయంగా తొలి ద‌శ‌లో త‌న స‌హ‌చ‌రుడైన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో కూడా అనంత‌ర కాలంలో హోరాహోరీగా పోరాడుతూ ఎదిగిన చంద్ర‌బాబుకు ఇప్పుడు జ‌గ‌న్ వంటి  దూకుడుగా ఉండే యువ‌నేత‌తో పోరాడాల్సి రావ‌డం ఇబ్బందిని క‌లిగించే ప‌రిణామ‌మే.

ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ కు యువ‌త‌లో ఫాలోయింగ్ ఉంద‌ని, అందుక‌ని టీడీపీలో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కు పెద్ద‌పీట వేయ‌డం ద్వారా అత‌డిని జ‌గ‌న్‌కు ప్ర‌త్య‌ర్థిగా నిల‌పాల‌ని పార్టీ శ్రేణుల‌నుంచి అంత‌కంత‌కూ డిమాండ్లు పెరుగుతూ వ‌చ్చాయి.  ఆ డిమాండ్ల‌కు త‌లొగ్గి త‌న‌యుడికి పార్టీలో ప‌ద‌వినిచ్చి చంద్ర‌బాబును లోకేష్ పాత్ర‌ను ప్ర‌స్తుతానికి పార్టీకి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే పార్టీకి 50 ల‌క్ష‌ల మంది కార్య‌కర్త‌ల‌తో అజేయ‌బ‌ల‌గాన్ని త‌యారు చేయాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకుని దాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌గ‌ల‌గ‌డం ద్వారా లోకేష్ భ‌విష్య‌త్ పార్టీ నేత‌గా త‌న‌ను తాను నిరూపించుకున్నారు.  ఈ ప‌రిణామాల కార‌ణంగా మ‌ధ్య ఎన్టీఆర్ త‌న‌యుడు హ‌రికృష్ణ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుల మ‌ధ్య కోల్డ్‌వార్ జ‌రుగుతోంద‌నే వార్త‌లు  కూడా గ‌ట్టిగానే వినిపించాయి.

ఇదిలా ఉండ‌గా లోకేష్‌కు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని పార్టీలో లోకేష్ అనుయాయుల‌నుంచి చంద్ర‌బాబుకు గట్టిగానే విన‌తులు అందు తున్నాయ‌ట‌. అయితే ఏ నిర్ణ‌యమైనా ఆచితూచి ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించిగాని నిర్ణ‌యం తీసుకోని చంద్ర‌బాబు ఇత‌మిద్ధంగా ఇంకా ఈ విష‌యం ఏమీ తేల్చ‌లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తనయుడు నారా లోకేష్ అలక పాన్పు ఎక్కాడా? మంత్రి పదవి కోరికను తీర్చకపోవడంతో తండ్రికి లోకేష్ తన అసంతృప్తిని బాహాటంగానే తెలియజేస్తున్నాడా..? అంటే ఔననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. అమరావతి వేదికగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల తొలి రోజున లోకేష్ హాజరు కాకపోవడంపూ పార్టీ నేత‌ల్లో గ‌ట్టి చ‌ర్చే జ‌రుగుతోంది. అయితే ఇందులో నిజానిజాల మాటేమిటో తెలుసుకోవాలంటే కాస్త ఓపిగ్గా వేచిచూడాల్సిందే..