డీకే అరుణ‌కు కేసీఆర్ దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌, మాజీ మంత్రి అయిన డీకే అరుణ ప‌ట్టుబ‌ట్టి ఉద్య‌మాలు చేసి ప్ర‌త్యేక గ‌ద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయించుకున్నారు. అరుణ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్లో రెండు ద‌శాబ్దాలుగా త‌న హ‌వా కొన‌సాగిస్తున్నారు. 1999 నుంచి వ‌రుస‌గా ఓట‌మి లేకుంగా గ‌ద్వాల్ నుంచి విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకే విప‌క్షాల నాయ‌కులు భ‌య‌ప‌డిపోతున్నారు.

కేసీఆర్‌తో పాటు అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేసే త‌క్కువ మందిలో డీకే అరుణ కూడా ఒక‌రు. ఇక గ‌ద్వాల్ జిల్లాను ఏర్పాటు చేసినందుకు ఆమె కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే డీకే అరుణ గద్వాల్ జిల్లా కోరిక‌ను తీర్చిన కేసీఆర్ ఇప్పుడు ఆమెకు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌న్న వార్త‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా లీక్ అయ్యాయి.

డీకే అరుణ‌కు కేసీఆర్ ఇచ్చిన ఆఫ‌ర్ ఇప్పుడు తెలంగాణ‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ ఆమెకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. డీకే అరుణ తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందడంతో పాటు మ‌హిళానేత‌. టీఆర్ఎస్‌కు బ‌ల‌మైన మ‌హిళా నేత‌ల కొర‌త కూడా ఉంది. కేసీఆర్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు ఎవ్వ‌రూ లేరు.

డీకే అరుణ‌ను పార్టీలో చేర్చుకుని ఆమెకు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తే టీఆర్ఎస్ ఒకే దెబ్బ‌కు ఎన్నో పిట్టల‌న్న చందంగా కేసీఆర్ అనేక విష‌యాల్లో స‌క్సెస్ అవుతారు. అరుణతో రెడ్డి కోటా+మ‌హిళా కోటా+వెన‌క‌ప‌డిన పాల‌మూరుకు డిప్యూటీ సీఎం పోస్టు కోటాలు పూర్తి చేసిన‌ట్ల‌వుతుంది. కేసీఆర్ ఈ ఐడియాతోనే అరుణ గ‌ద్వాల్ జిల్లా కోరిక‌ను తీర్చి ఆమెకు ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

జిల్లాల విభ‌జ‌న‌ను స‌క్సెస్‌గా పూర్తి చేసిన కేసీఆర్ ఇప్పుడు త్వ‌ర‌లోనే త‌న మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుట్ట‌నున్నార‌ట‌. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న అరుణ‌ను పార్టీలో చేర్చుకుని ఆమెకు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తార‌ని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వ‌రంగ‌ల్ జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న క‌డియంను ఆ పోస్టు నుంచి త‌ప్పించి ..ఆయ‌న్ను కేవ‌లం మంత్రిగా కొన‌సాగిస్తూ ఆ ప్లేస్‌ను అరుణ‌తో భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక మ‌రో డిప్యూటీ సీఎం మహమూద్ అలీని అలానే డిప్యూటీ సిఎంగా కొనసాగిస్తార‌ని తెలుస్తోంది. ఇక అరుణ కూడా టీఆర్ఎస్‌లో చేరితే తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌రో బ‌ల‌మైన నేత‌ను కోల్పోయిన‌ట్టే. ఇక గ‌ద్వాల్‌తో పాటు వ‌న‌ప‌ర్తి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో టీఆర్ఎస్ మ‌రింత బ‌లోపేతం అవుతుంది.