జ‌గ‌న్ స‌వాల్‌తో బాబు ఇరుకున ప‌డ‌తాడా..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డం, నేత‌ల వ‌రుస‌ వ‌ల‌స‌ల‌తో బ‌ల‌హీన‌ప‌డిన త‌న పార్టీ క్యాడ‌ర్‌లో తిరిగి ఆత్మ‌స్థైర్యం నింప‌డ‌మే ల‌క్ష్యంగా   వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ భారీ పొలిటిక‌ల్ గేమ్‌కు తెర తీయ‌బోతున్నారా… అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధాన‌మిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవ‌డంపై ఇటు టీడీపీని, అంటు బీజేపీని ఇర‌కాటంలో పెట్ట‌డంద్వారా త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ‌కు బాట‌లు వేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

రాష్ట్రానికి హోదా ఇవ్వ‌క‌పోతే ఆ అంశంపై త‌మ పార్టీ ఎంపీలు  పార్ల‌మెంట్ స‌భ్య‌త్వానికి  రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత‌, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో మ‌ళ్లీ వేడిని పుట్టిస్తోంది. యువభేరి కార్యక్రమం వేదికగా జగన్‌ చేసిన ఈ ప్రకటన రానున్న కాలంలో రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో కాక పుట్టించ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణలు వెలువ‌డుతున్నాయి. రాజీనామా చేసాక త‌మ ఎంపీలు ప్ర‌త్యేక హోదానే ఎన్నిక‌ల అజెండాగా చేసుకుని తిరిగి ప్ర‌జా తీర్పును కోర‌తార‌ని కూడా జ‌గ‌న్ తెలియ‌జేశారు. అంటే ఈ నినాదంతో ఆయ‌న ఎన్నిక‌ల‌కు వెళితే ప్ర‌త్యేక హోదాను గ‌ట్టిగా కోరుకునే త‌ట‌స్థులు కూడా జ‌గ‌న్ పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌క త‌ప్ప‌దు మ‌రి.

అందుకే ఇది ఆయ‌న తాజా రాజ‌కీయం వ్యూహంలో భాగమ‌ని అధికార టీడీపీ భావిస్తోంది.. ఓర‌కంగా ఇది అధికార టీడీపీ-బీజేపీ కూట‌మికి ఇబ్బంది క‌లిగించే ప‌రిణామ‌మేన‌ని చెప్పాలి. అంత‌కు మించి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా నిలువ‌రించేందుకు కూడా జ‌గ‌న్ సంధించ‌నున్న రాజ‌కీయ అస్త్రంగా దీన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. జ‌గ‌న్ ఒక‌వేళ  త‌న పార్టీ ఎంపీల రాజీనామాల విష‌యంలో.. దూకుడుగా వెళితే  ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏవిధ‌మైన వ్యూహం అనుస‌రించునున్నారన్న‌ది కూడా ఆస‌క్తిని క‌లిగిస్తున్నఅంశంగా చెప్పాలి.

విభజన సమయంలో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్‌, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కలసి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నేడు తుంగ‌లో తొక్క‌డంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వున్న మాట నిజం. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండ‌టంతో…  చివ‌ర‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి త‌లూప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు కూడా రాజీప‌డిపోయారు. ఇప్పుడు దీన్నే త‌న రాజ‌కీయ ఆయుధంగా జ‌గ‌న్ చేసుకోవ‌డం.. రాజ‌కీయ వ్యూహ ప‌రంగా జ‌గ‌న్‌కు ఏమేర‌కు ల‌బ్ధి చేకూరుస్తుంద‌న్నది స‌మీప భ‌విష్య‌త్తులోనే తేలిపోనుంది.