ఆ మంత్రి అవినీతికి చంద్ర‌బాబు బ్రేకులు

ఇప్పుడు రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌డ‌మంటేనే కోట్ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మైపోయింది. అందుకే విలువ‌ల‌తోకూడిన‌ రాజ‌కీయాలు సాగించేవారి సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి, ఎమ్మెల్యే ప‌ద‌విలో కూర్చోడానికే ఇర‌వై నుంచి ముప్పై కోట్లు ఖ‌ర్చ‌వుతోంద‌ని శాస‌న‌స‌భ్యులు అన‌ధికారికంగా మాట్లాడుతున్న‌పుడు వాపోతూ చెపుతున్న మాట‌. అందుకే గెలిచిన ద‌గ్గ‌ర్నుంచీ డబ్బులు తిరిగి రాబ‌ట్టుకునేందుకు…ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డేంద‌కు సొమ్ము స‌మ‌కూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్న‌వారే నేటి రాజ‌కీయాల్లో అధిక శాతం.

ప్ర‌స్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేర‌క‌మైన‌ అడ్డగోలు దందా ఒక‌టి జ‌రిపేందుకు ఆ శాఖ మంత్రి, ఓ ఉన్న‌తాధికారి  ప‌క్కా స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారం ముఖ్య‌మంత్రికి దృష్టికి వెళ్ల‌డంతో వారి దూకుడుకు ప్ర‌స్తుతానికి బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తోంది. స‌ర్కారులో ఉన్న‌పెద్ద‌లు అవినీతికి పాల్ప‌డితే అది ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను ప‌లుచ‌న చేస్తుంద‌ని, ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండాల‌ని ముందునుంచే సీఎం చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను ఒక ప‌క్క నిత్యం హెచ్చ‌రిస్తూ ఉన్నా ఇలాంటివి జ‌రుగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

విష‌య‌మేమిటంటే ఆర్ అండ్ బీ శాఖ‌ మంత్రి సిద్ధా రాఘవరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ కుమ్మక్కయి వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు దక్కేలా స్కెచ్ వేశారట‌. ఏ శాఖలో అయినా టెండర్లు పిలిచేందుకు ఒకే నిబంధనలను పాటిస్తారు. అయితే తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు దక్కేలా ఆర్ అండ్ బి ఈఎన్ సీ గంగాధరం పావులు కదిపి.. కోట్ల రూపాయలు మామూళ్లుగా దండుకునేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

ఏపీలోని  శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో  కలెక్టర్ కార్యాలయాలకు సంబంధించి సమగ్ర భవనాల నిర్మాణానికి సంబంధించి కొద్దికాలం క్రితం టెండర్లు పిలిచారు. ఇందులోనూ  జీవో 94కు తూట్లు పొడుస్తూ తమకు కావాల్సిన సంస్థకు అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పలు సంస్థలు ఈ ప‌నుల కోసం బిడ్లు దాఖలు చేశాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 70 కోట్ల రూపాయల పని విషయంలో మంత్రి రంగంలో దిగారు. ఆయనకు సహజంగానే ఈఎన్ సీ వంత పాడటం తో త‌మ అనుయాయుల‌కు చెందిన సంస్థ‌కు పోటీగా నిలిచిన బీఎస్ ఆర్ సంస్థకు చెందిన టెండర్ దరఖాస్తును  డిస్ క్వాలిఫై చేశారు.

ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. తమ టెండర్ ను  డిస్ క్వాలిఫై చేయటంతో ఈ సంస్థ ప్రతినిధులు సర్కారుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా రంగంలోకి దిగటంతో మంత్రి సిద్ధా రాఘవరావు, ఈఎన్ సీ గంగాధరం చేసిన ఫీట్లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌. శ్రీకాకుళం జిల్లా ఎస్ ఈ మాత్రం బిఎస్ ఆర్ ఇన్ ఫ్రా టెండర్ కు ప్రైస్ బిడ్ ఓపెన్ చేసేందుకు అర్హమైనదే అని తేల్చటంతో వీరంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అయితే మంత్రి మాత్రం తాను సీఎంతో మాట్లాడి తనకు అనుకూలంగా నిర్ణయం తెప్పించుకోవాలనే ప్రయత్నాల్లో ఇప్ప‌టికీ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ గోల్ మాల్ వ్యవహారంలో కాంట్రాక్టు సంస్థలు ఈఎన్ సీకి భారీ ఎత్తున ముడుపులు ముట్టచెప్పటానికి అంగీకరించినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పారదర్శకంగా టెండర్లు పిలిస్తే సర్కారుకే ఆదా అయ్యే అవకాశం ఉన్నా..దోపిడీలో భాగంగా ఎక్కువ మొత్తానికి టెండ‌ర్లు వేసిన‌ వారికే ప‌నులు ద‌క్కేలా అక్రమార్కులు మొగ్గుచూపుతున్నారన్న‌మాట‌. ఇంకా ఫైనాన్సియల్ బిడ్స్ ఓపెన్ చేయకపోయినా ఎవరికి ఎంత ద‌క్క‌నుందో కూడా  అధికారులు చెప్పేస్తున్నారు.  అంటే ప్ర‌భుత్వ ఖ‌జానాకు తూట్లు పొడిచేందుకు రాజ‌కీయ నేత‌లు, అధికారులు ఇలా పోటీ ప‌డుతున్నారన్న‌మాట‌..!