ఆ డైరెక్ట‌ర్‌పై చంద్ర‌బాబు నిఘా పెట్టారా..!

తెలుగు తెర వేల్పులుగా జ‌నం కొలిచిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు ఇద్ద‌రితోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు రూపొందించిన మేటి ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు.  ఆ మ‌హాన‌టులు ఇద్ద‌రి త‌రువాత‌ సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచింది కూడా దాస‌రేన‌ని చెప్పాలి. దాదాపు కొన్నిద‌శాబ్దాలుగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా దాని ప‌రిష్కారంలో  దాస‌రి నారాయ‌ణ‌రావుదే ప్ర‌ధాన పాత్ర‌.

సినిమాల్లో ఎన్టీఆర్ తో స‌న్నిహితంగా ఉన్న‌దాస‌రి రాజ‌కీయాల్లో మాత్రం మొద‌టినుంచీ కాంగ్రెస్ పార్టీనే అనుస‌రించారు. ఆ పార్టీ త‌ర‌పున  రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ. కేంద్రంలోమంత్రిగానూ కూడా గ‌తంలో పనిచేశారు. ఇక రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు.. దాస‌రి నారాయ‌ణ‌రావుకూ ఎప్పుడూ చుక్కెదురేన‌ని చెప్పాలి. ఇక ఇటీవ‌ల ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం త‌ల‌కెత్తుకున్నాక.. దాస‌రి దానికి బ‌హిరంగంగా గట్టిగానే మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.  కాపు ఉద్య‌మాన్ని భుజాన వేసుకున్న దాసరి…. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రాజ‌కీయ‌ వ్య‌తిరేక శ‌క్తుల‌కు కేంద్ర‌బిందువుగా మారారు.

కొన్ని నెల‌ల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ దాస‌రి నారాయ‌ణ‌రావును స్వ‌యంగా ఇంటికి వెళ్లి క‌లుసుకోవ‌డం, ఆ త‌ర్వాత కొద్దికాలానికే .. ముద్ర‌గ‌డ ఉద్య‌మ బాట ప‌ట్ట‌డం వంటి ప‌రిణామాల‌తో కాపు ఉద్య‌మానికి ఆజ్యం పోయ‌డంలో జ‌గ‌న్, దాస‌రి నారాయ‌ణ‌రావు, మ‌రికొందరు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ముఖ పాత్ర‌నే పోషిస్తున్నార‌ని.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  దీంతో త‌న‌ వ్య‌తిరేక శ‌క్తుల‌తో క‌లిసి దాస‌రి ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో, తెలుసుకునేందుకు చంద్ర‌బాబు గ‌ట్టి నిఘానే పెట్టిన‌ట్టు స‌మాచారం.  ఇందులో భాగంగా ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు దాస‌రిపై నిరంతర నిఘా పెట్టాయ‌ట‌.

ఇటీవ‌ల‌… దాస‌రి నారాయ‌ణ‌రావు చేసిన కామెంట్లు కూడా ఈ నిఘా ఆరోప‌ణ‌ల‌కు  ఊత‌మిస్తున్నాయి. ఇటీవ‌ల‌ ముద్ర‌గ‌డ‌, దాస‌రి, అంబ‌టి, ఉమ్మారెడ్డి వంటి కాపు నేత‌లు ఓ హోట‌ల్లో స‌మావేశ‌మయ్యారు.  ఈ సమావేశంలో దాస‌రి మాట్లాడుతూ తాము స‌మావేశ‌మైన హోట‌ల్లో సీసీ టీవీలు అమ‌ర్చార‌ని,  త‌మ సంభాష‌ణ‌లు చంద్ర‌బాబు నేరుగా చూసే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమంటూ  వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తే.. సీఎం చంద్ర‌బాబు త‌మ‌పై నిఘా పెట్టార‌ని దాస‌రి ప‌రోక్షంగా చెప్పిన‌ట్టేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్ర‌చారాన్ని టీడీపీ వ‌ర్గాలు గ‌ట్టిగా ఖండిస్తున్నాయి.

 కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూక‌లు చెల్లిపోవ‌డంతో.. రాజ‌కీయం నిరుద్యోగులుగా మారిన కొంత‌మంది ఆ పార్టీ నాయ‌కులు త‌మ ఉనికి కోసం జ‌గ‌న్‌తో క‌లిసి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని, ఇందులో భాగంగానే టీడీపీపై దుష్ప్ర‌చారం చేస్తున్నారని.., వారి కుట్ర‌లు ఫ‌లించ‌వ‌ని వారంటున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబుపై దాస‌రి నారాయ‌ణ‌రావు త‌దిత‌రులు  ఇప్ప‌టిదాకా చేస్తున్న ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం, ప్ర‌త్య‌క్ష రూపం తీసుకునే మాదిరిగానే క‌నిపిస్తోంది.  మ‌రి దీని ప‌ర్య‌వ‌సానాలు ఎలా ప‌రిణ‌మిస్తాయోన‌న్న‌ది రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తున్న‌ది.