అబ్బాయ్ జ‌గ‌న్ కోసం రంగంలోకి బాబాయ్‌

జ‌గ‌న్ పార్టీ వైకాపా నుంచి ఆయ‌న బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నారా అంటే ఇప్పుడు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. త్వర‌లోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని పంపాల‌ని భావిస్తున్నారు. రానున్న 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా ఈ ప్ర‌య‌త్నం బాగుంటుంద‌ని ఆయ‌న ప‌క్కా ప్లాన్‌తో బాబాయికి ఇప్ప‌టికే క‌బురు కూడా పంపిన‌ట్టు స‌మాచారం.

అంతేకాకుండా, ఎట్టి ప‌రిస్థితిలో వివేకా గెలుపు అవ‌స‌రమ‌ని, ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అంద‌రూ ఆయ‌న‌కు స‌హ‌క‌రించాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న పార్టీ స్థానిక నాయ‌క‌త్వానికి గ‌ట్టిగా ఆదేశాలు జారీ చేశార‌ని తెలిసింది. నాలుగు రోజుల క్రితం వైఎస్‌ వివేకా కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాల్సిందిగా తనపై ఒత్తిడి వస్తోందని.. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. దీంతో ప‌ది రోజులుగా వివేకా.. జిల్లాలో ప‌ర్య‌ట‌న కూడా మొద‌లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వివేకాను ఢీకొనేందుకు అధికార టీడీపీ కూడా సిద్ధ‌మైపోయింది.

పులివెందులకే చెందిన బీటెక్ రవిని పోటీకి దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 26న కడపలో జరిగే టీడీపీ సమస్వయ కమిటీ సమావేశంలో దీనిపై ఓ నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక‌, మిగిలిన రెండు స్థానాలైన ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల విష‌యానికి వ‌స్తే..  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విష‌యంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ  బచ్చలపుల్లయ్య కే మ‌రోసారి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం విష‌యంలో టీడీపీ అభ్య‌ర్థిగా కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన  కేజే రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అయితే, పులివెందుల‌కు చెందిన టీడీపీ నేత  రామగోపాల్ రెడ్డి కూడా ఈ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక‌, ఈ రెండు స్థానాల నుంచి వైకాపా అభ్య‌ర్థుల ఖ‌రారు కావాల్సి ఉంది.