విశ్వగుంతల నగరంపై కెటియార్‌ నజర్‌.

విశ్వనగరం హైదరాబాద్‌ విశ్వ గుంతల నగరంగా మారిపోయిందని నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం బయల్దేరింది. రోడ్లపై మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్‌ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి రేవంత్‌రెడ్డి, ఇతర టిడిపి నాయకులు సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. విపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి గ్రేటర్‌ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పరిస్థితిని అంచనా వేసిన మంత్రి కెటియార్‌ స్వయానా రంగంలోకి దిగారు. రోడ్లు దుస్థితిపై జిహెచ్‌ఎంసి అధికారులతో చర్చించారు.

యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్‌లోని రోడ్లను బాగు చేయాలని, ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా రోడ్ల మరమ్మత్తు పనులకు ఇబ్బంది కలుగుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా, కుంటి సాకులు చెప్పవద్దని వారిపై మంత్రి గుస్సా అయ్యారట. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో భారీ విజయాన్ని టిఆర్‌ఎస్‌కి ప్రజలు కట్టబెడితే, ప్రజల వెన్ను విరిగేలా రోడ్లను తయారుచేసిన ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ హైదరాబాద్‌లో రోడ్లు ఇంత దారుణంగా లేవు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ రోడ్లు నిరాదరణకు గురయ్యాయన్న భావన హైదరాబాదీల్లో వ్యక్తమవుతోంది.