మోడీ పొగిడారు, అమిత్‌ షా విమర్శించారు.

రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్‌ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్‌ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్‌ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది.

ఈ విమర్శలతో టిఆర్‌ఎస్‌ నాయకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బిజెపి, తెలంగాణను ఆదుకోవడంలేదని ఆరోపించారు టిఆర్‌ఎస్‌ నాయకులు. కేంద్రం, తెలంగాణ పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చేతనైతే తెలంగాణకు అదనంగా నిధులు తీసుకురావాలని, హైకోర్టు విభజనకు సహకరించాలని సవాల్‌ విసిరారు గులాబీ నేతలు. కెసియార్‌, నరేంద్రమోడీ బాగానే ఉన్నారు. మధ్యలో ఇతర నేతలకే సమస్య వస్తోంది. కెసియార్‌ ఏమన్నా బహిరంగ వేదికపై తెలంగాణ సమస్యల్ని నరేంద్రమోడీకి అర్థమయ్యేలా ప్రస్తావించారా? లేదే. నరేంద్రమోడీ కూడా కెసియార్‌ని విమర్శించారా? లేదే. ఎందుకిలా? ఇదే రాజకీయం.