జ‌గ‌న్ స‌వాల్‌కు బాబు స్పందిస్తాడా..!

ఎప్ప‌టిక‌ప్పుడు అధికార టీడీపీ, సీఎం చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైరైపోతున్న వైకాపా అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రో స‌వాలు విసిరారు. ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని.. జ‌నం ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో తేల్చుకుందామ‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. పోలీసులు, ధ‌నం, బ‌లం, బ‌ల‌గం అంతా మీద‌గ్గ‌రే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ప్ర‌వాస ఆంధ్రుల‌తో సాక్షి టీవీలో నిర్వ‌హించిన లైవ్ షోలో జ‌గ‌న్ మాట్లాడారు. చంద్ర‌బాబుకు నైతిక విలువ‌లు లేవ‌ని, అవినీతిలో కూరుకుపోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న పార్టీ నుంచి లోబ‌రుచుకుని పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు.. అలా వ‌చ్చిన 20 మంది వైకాపా ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించే ధైర్యం ఉందా అని ప్ర‌శ్నించారు.

వారితో రాజీనామా చేయించి తిరిగి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్దామ‌ని, అప్పుడు ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌క్షాన ఉంటారో తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు. అధికారంలో ఉన్నది చంద్రబాబేనని.. పోలీసులు, డబ్బు వారి దగ్గరుందని, అయినా ప్రజల మద్దతు ఎవరికో తేల్చుకుందామని అన్నారు. ప్రశ్నించే విపక్షం లేకుండా చేయడానికి చంద్రబాబు కుట్ర ప‌న్నుతున్నార‌ని విమ‌ర్శించారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న చంద్రబాబుకు, ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

అయితే, గ‌తంలోనూ జ‌గ‌న్ అనేక స‌వాళ్లు విసిరినా చంద్ర‌బాబు అండ్ టీడీపీ నేత‌లు ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. పైపెచ్చు ఆర్థిక నేర‌స్తుడు అంటూ ఆయ‌న‌పై ఎదురు దాడితో స‌రిపెట్టారు. మ‌రి ఈ సంద‌ర్భంగా అయినా.. చంద్ర‌బాబు స్పందిస్తారా? అన్న‌ది ప్ర‌శ్నే! ప్ర‌స్తుతానికైతే.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న పోరాటం ఆగ‌ద‌ని ప‌దేప‌దే చెబుతున్న జ‌గ‌న్ తాజా లైవ్ షోలో త‌న మ‌నోగ‌తాన్ని మ‌రోసారి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.