ఏపీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల పై TJ విశ్లేష‌ణ‌

రాష్ట్రంలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో త‌మ పార్టీకి తిరుగులేద‌ని, మ‌రింత బలం పెంచుకున్నామ‌ని చాటుకోవాల‌ని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది.. అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల్లో అధిక స్థానాల్లో గెల‌వ‌డం ద్వారా అధికార పార్టీకి క‌ళ్లెం వేయాల‌ని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆత్మ‌స్థైర్యంతో కార్య‌క‌ర్త‌ల‌ను స‌న్న‌ద్ధం చేయాల‌ని విప‌క్షంలోని వైసీపీ వ్యూహాలు ర‌చిస్తోంది.

ఈ ఎన్నిక‌ల్లో ప్రధానం పోటీ తెలుగుదేశంపార్టీ, వైసీపీల మధ్యే పోటీ ఉంటుంద న్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు… అయితే, టీడీపీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ పాత్ర, ప్రతిపక్షాల్లోని కాంగ్రెస్, వామపక్షాలు పాత్రపైన కూడా ప్ర‌స్తుతం గ‌ట్టిగానే చర్చలు మొదలయ్యాయి. అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు గురువారం విజయవాడలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. వచ్చే నవంబర్లో జరగాల్సిన ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోటీపై ఆస‌క్తి చూపుతున్న నేత‌ల జాబితాలను సిద్ధం చేయాల్సిందిగా చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా వివరాలు పక్కాగా ఉండేట్లు చూసుకోవాలని కూడా సూచించారు.

ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత‌ సుమారు పది రోజుల క్రితమే 11 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్‌చార్జిలను కూడా నియమించారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్న‌ ఆశావహుల బలా బలాలు, బలహీనతలు, సామాజిక వర్గంతో పాటు పార్టీలో ఎంత కాలం గా పనిచేస్తున్నార‌నే అంశాల‌పై ఆరా తీసి నివేదికను సిద్ధం చేసి పార్టీ అధినేత‌కు అందించ‌డం ఈ ఇన్‌చార్జిల బాధ్యత.

ఇక పొత్తుల విష‌యానికొస్తే ..ఇటీవ‌ల కేంద్రం సాయం విష‌యంలో జ‌రిగిన ప‌రిణామాల్లో బీజేపీ, టీడీపీల పొత్తు విచ్ఛిన్న‌మ‌వుతుందేమోన‌న్న అనుమానం క‌లిగిన మాట వాస్త‌వ‌మే ఐనా ప్ర‌స్తుతం ప‌రిస్థితి కుదురుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల‌ పొత్తు విష‌యం కాస్త ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తోంది. తమకు విశాఖపట్నం, తిరుపతి కార్పొరేషన్లతో పాటు గుంటూరు, కాకినాడ కార్పొరేషన్లలో ఏదో ఒక మేయర్ పీఠాన్నిఇవ్వాలని కోరాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు సాకార‌మ‌వుతుంద‌న్న అంశంలో ఆ పార్టీ నేత‌లే అనుమానాలు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం..

ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాక‌రంగా భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు బీజేపీ ప‌ట్ల అంత ఉదారంగా, సుతిమెత్త‌గా ఈ సారి వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌చ్చు. ఇక వైసీపీ, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ ఏం చేస్తాయ‌న్న‌ది మ‌రో అంశం.. ఇవి క‌లిసి పోటీ చేసేందుకు అంత‌గా అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు… మొత్తంమీద ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రిహార్స‌ల్స్‌గా భావించాల్సి ఉంటుంది.